బిగ్‌బాస్‌కు బాలు వెళ్లడం లేదట

Bigboss

– క్లారిటీ ఇచ్చిన ‘గుండెనిండా గుడిగంటలు’ హీరో

బిగ్‌బాస్  సీజన్  10 త్వరలో మొదలు కాబోతోంది. దాంతో ఇప్పటికే రెండు తెలుగు స్టేట్స్ లో బిగ్ బాస్ ఫీవర్ మొదలైపోయింది.     హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్స్ ఎవరనే దానిపై సోషల్ మీడియాలో  చర్చ జరుగుతోంది.  సినీ, టీవీ రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీల పేర్లు కంటెస్టెంట్స్ లిస్ట్‌లో వినిపిస్తున్నాయి. అయితే ఈ పేర్లలో ఎవరు నిజంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెడతారనే దానిపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

ప్రతి సీజన్‌లోనూ కొందరు సెలబ్రిటీల పేర్లు ముందుగానే వైరల్ అవుతుంటాయి. తాజాగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10కి సంబంధించి ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్ ఫేమ్ బాలు అలియాస్ విష్ణుకాంత్ పేరు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. బాలు సీరియల్‌ను వదిలేసి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లబోతున్నాడంటూ ప్రచారం జరిగేసరికి ఆయన ఫాన్స్ అంతా   ఆందోళనకు గురయ్యారు.

బాలు లేకపోతే సీరియల్ చూడం ..  అభిమానుల కామెంట్స్

స్టార్ మాలో ప్రసారమవుతున్న ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్‌కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఇందులో బాలు, మీనా పాత్రల చుట్టూనే కథ ప్రధానంగా సాగుతుంది.  ఇందులో బాలుగా విష్ణుకాంత్ చేసే అల్లరి, కామెడీ, పంచ్‌లు, హీరోయిజం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. విష్ణుకాంత్‌కు  లేడీస్, యూత్ నుంచి  మంచి ఫాలోయింగ్ ఉంది. బాలు పాత్రపై సోషల్ మీడియాలో తరచూ అభిమానులు కామెంట్స్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయన బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నారనే వార్త వైరల్ కావడంతో అభిమానులు స్పందించారు. ‘బాలు లేకుండా సీరియల్ చూడలేం’, ‘మీ కోసమే సీరియల్ చూస్తున్నాం.. వెళ్లొద్దు’ అంటూ నెటిజన్స్   కామెంట్స్ చేశారు. కొందరు విష్ణుకాంత్‌ను ట్యాగ్ చేస్తూ ఈ వార్త నిజమేనా అని ప్రశ్నించారు.

బిగ్‌బాస్‌కు వెళ్లడం లేదు.. క్లారిటీ ఇచ్చిన విష్ణుకాంత్

అభిమానుల్లో నెలకొన్న ఈ గందరగోళానికి విష్ణుకాంత్ స్వయంగా తెరదించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో విడుదల చేసి బిగ్‌బాస్‌కి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ‘నేను గుండెనిండా గుడిగంటలు సీరియల్ వదిలేసి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10కి వెళ్తున్నానని సోషల్ మీడియాలో రీల్స్, పోస్టుల ద్వారా మీరంతా చూసే ఉంటారు. నేను కూడా చూశాను. వాటికి దాదాపు 4 వేల మంది కామెంట్స్ చేశారు. చాలా మంది నాకు పర్సనల్‌గా మెసేజ్ కూడా చేశారు’ అని విష్ణుకాంత్ తెలిపారు. అభిమానులు చూపించిన ప్రేమ తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. ‘బాలు గారు.. మీరు సీరియల్‌ను వదిలేసి వెళ్లకండి. మీరు వెళ్లిపోతే ఆ ప్లేస్‌లో వేరే ఎవరినీ చూడలేం’ అంటూ చాలామంది ప్రేమతో కామెంట్స్ చేశారని వెల్లడించారు.

‘బాలుగానే మీ ముందుంటా’

అభిమానులకు మరింత క్లారిటీ ఇస్తూ.. తాను బిగ్‌బాస్‌కి వెళ్లడం లేదని విష్ణుకాంత్ స్పష్టం చేశారు.‘నేను బిగ్‌బాస్‌కి వెళ్లడం లేదు. మీరందరూ కోరుకుంటున్నట్లుగానే బాలు లాగా మీ ముందుంటా. బాలు లాగానే మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తా’ అని ఆయన చెప్పారు. తనపై, సీరియల్‌పై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటివరకు సీరియల్‌కు మంచి సపోర్ట్ ఇచ్చి మంచి స్థాయిలో నిలబెట్టారని, ఇకముందు కూడా అదే విధంగా ఆదరించాలని కోరారు. చివరగా ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బాలు  ఇచ్చిన ఈ క్లారిటీతో ప్రస్తుతం బాలు బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నారనే ప్రచారానికి చెక్ పడినట్లే కనిపిస్తోంది. అయితే బిగ్‌బాస్ సీజన్ 10 కంటెస్టెంట్స్‌పై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇలాంటి ఊహాగానాలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రస్తుతం విష్ణుకాంత్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.