ఓ యువ ఇంజినీర్ విజయగాథ

Kumar

టీ, ఇడ్లీలు అమ్మిన బాలుడి నుంచి చంద్రయాన్‌-3 బృంద సభ్యుడి వరకు

ఒకప్పుడు కుటుంబానికి అండగా నిలిచేందుకు టీ, ఇడ్లీలు అమ్మిన ఓ యువకుడు.. తన ప్రతిభతో దేశం గర్వించే స్థాయికి ఎదిగాడు. ఆర్థిక ఇబ్బందులు చదువుకు అడ్డంకిగా మారినా, లక్ష్యంపై నమ్మకం మాత్రం అతడిని ముందుకు నడిపించింది. అతడే ఛత్తీస్‌గఢ్‌కు చెందిన భరత్ కుమార్.

బరోడా ప్రాంతానికి చెందిన భరత్ తండ్రి బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉండటంతో తల్లి టీ, ఇడ్లీలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించేవారు. రైళ్ల రాకపోకలతో సందడిగా ఉండే ప్రాంతంలో భరత్ కూడా చిన్న వయసులోనే తల్లికి సహాయం చేస్తూ ప్లేట్లు కడగడం, టీ అందించడం వంటి పనులు చేసేవాడు. అదే సమయంలో చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు.

స్థానిక కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్న భరత్‌కు తొమ్మిదో తరగతిలో ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఎదురైంది. అయితే పాఠశాల యాజమాన్యం ఫీజు మాఫీ చేయడంతో పాటు ఉపాధ్యాయులు పుస్తకాల కోసం సహాయం చేశారు. ఆ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకున్న భరత్ ప్రతిభతో ముందుకు సాగి 12వ తరగతిలో మంచి ఫలితాలు సాధించాడు.

తర్వాత ఐఐటీ ధన్‌బాద్‌లో ఇంజినీరింగ్‌ చదివే అవకాశం లభించింది. అక్కడ కూడా ఆర్థిక సమస్యలు ఎదురైనా పలువురు దాతలు, సంస్థలు అతడికి అండగా నిలిచాయి. చదువులో ప్రతిభ కనబరిచిన భరత్ అత్యుత్తమ మార్కులతో స్వర్ణ పతకం సాధించాడు. ఇంజినీరింగ్‌ చివరి దశలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా ఇస్రోలో ఉద్యోగం పొందాడు.

తన ప్రతిభతో అంతరిక్ష పరిశోధన రంగంలో అడుగుపెట్టిన భరత్, చంద్రయాన్‌-3 మిషన్‌లో భాగస్వామిగా నిలిచిన యువ ఇంజినీర్‌గా గుర్తింపు పొందాడు. భరత్ ప్రయాణం ఒక్కరి విజయగాథ మాత్రమే కాదు. సరైన సమయంలో పాఠశాల, ఉపాధ్యాయులు,కుటుంబ సభ్యులు సహకారం అందిస్తే ఇలాంటివారు వృద్ధిలోకి వస్తారు .