– శారద విద్యాసంస్థల్లో ఘనంగా ‘ఫ్రెషర్స్ డే’
విజయవాడప్రతినిధి: విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, మానవతా విలువలను పెంపొందించుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సూచించారు. విజయవాడ మొగల్రాజపురంలోని శారద ఇంటర్మీడియట్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో మంగళవారం ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ’12 వసంతాల ఫ్రెషర్స్ డే’ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ విద్యావేత్త డాక్టర్ విద్యాసాగర్ అబ్బూరి గౌరవ అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ విద్యాసంస్థలు కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో సత్ప్రవర్తన, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, స్నేహభావం, పరస్పర గౌరవం, సేవా దృక్పథం, లక్ష్యసాధన వంటి విలువలను పెంపొందించాలని పేర్కొన్నారు. విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారై స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు.
గౌరవ అతిథి డాక్టర్ విద్యాసాగర్ అబ్బూరి మాట్లాడుతూ విద్యార్థులు అందుబాటులో ఉన్న విద్యా వనరులను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తుకు స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. చదువుతో పాటు ఆటలు శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయని చెప్పారు. పోటీ ప్రపంచంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకొని సమయస్ఫూర్తితో లక్ష్యాన్ని చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు.
కళాశాల చైర్మన్ డాక్టర్ వై. రమేష్‌బాబు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు సాధించేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. మేనేజింగ్ డైరెక్టర్ వై. శారదాదేవి మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యమన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అంతా శారద కుటుంబంగా కలిసి పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
విద్యార్థుల చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని కళాశాల అడ్వైజర్ ఈ.యస్.ఆర్.కె. ప్రసాద్ తెలిపారు. విద్యార్థుల్లో సేవా దృక్పథాన్ని పెంపొందించేందుకు అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రతినిధులు వెల్లడించారు. జేఈఈ మెయిన్స్, నీట్ ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ఫలితాలు, మెడికల్, ఇంజినీరింగ్ సీట్ల వివరాలను కళాశాల జీఎం జి.వి.రావు వార్షిక నివేదికలో వివరించారు.
అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆటపాటలతో ఫ్రెషర్స్ డే వేడుకలు ఉత్సాహంగా సాగాయి. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి కళాశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.
