విజయవాడ ప్రతినిధి :
నిరుపేదలు, వృద్ధులకు ప్రతి నెలా క్రమం తప్పకుండా నిత్యావసర సరుకులు అందించడం అభినందనీయమని ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజికవేత్త, వేముల చారిటీస్ చైర్మన్ వేముల హజరత్తయ్య గుప్తా అన్నారు. అవోప సేవా ట్రస్ట్, ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఉదయం నిర్వహించిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి వేముల హజరత్తయ్య గుప్తా ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. లోటస్ ల్యాండ్‌మార్క్ కల్పతరు సెల్లర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 51 మంది వృద్ధులకు నిత్యావసర సరుకులతో పాటు వంట నూనె ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా హజరత్తయ్య గుప్తా మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్న నిరుపేదలు, ఆదరణకు నోచుకోని వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరూ మానవత్వంతో వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. సేవాభావంతో ముందుకు వచ్చే స్వచ్ఛంద సంస్థలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. సమాజంలో ఎంతోమంది నిరుపేదలు కనీస అవసరాలను తీర్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాంటి వారిని గుర్తించి, వారికి అవసరమైన సహాయాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని సూచించారు. కేవలం ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి పేదలకు అండగా నిలవాలని కోరారు.
అనాథలు, వృద్ధులు, నిరుపేదల పట్ల ఆదరణ చూపుతూ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగించడం ద్వారా సమాజంలో మానవత్వం, సేవాభావం పెంపొందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. సేవా కార్యక్రమాలు ఆపదలో ఉన్నవారికి ఆర్థికంగా తోడ్పడటమే కాకుండా, వారికి మానసిక ధైర్యాన్ని కూడా అందిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అవోప సేవా ట్రస్ట్ అధ్యక్షురాలు అరవేటి నిర్మలతో పాటు చిన్న సుబ్బారావు, నాగ సుందర్, సరస్వతి, సుమలత తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వృద్ధులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సభ్యులు సహకరించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తూ మరింతమంది నిరుపేదలకు సహాయం అందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.
