చనిపోయి 110 మిలియన్ ఏళ్లు..

Mammy

అయినా చెక్కుచెదరని డైనోసార్ ‘మమ్మీ’! 

కోట్లాది ఏళ్ల క్రితం భూమిపై సంచరించిన డైనోసార్లకు సంబంధించిన ఆధారాలు ఇప్పటికీ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. సాధారణంగా వాటి ఎముకలే శిలాజాలుగా బయటపడుతుంటాయి. కానీ కెనడాలో లభించిన ఓ నోడోసార్ శిలాజం మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఎముకలతో పాటు చర్మం, కవచం, మృదువైన కణజాలం, అంతర్గత అవయవాలకు సంబంధించిన ఆనవాళ్లు కూడా ఇందులో కనిపించడం విశేషం.

కెనడాలోని అల్బెర్టా ప్రాంతంలో ఫోర్ట్ మెక్‌మరే సమీపంలోని సన్‌కోర్ మిలీనియం గనిలో ఈ అరుదైన శిలాజం వెలుగులోకి వచ్చింది. సుమారు 110 మిలియన్ ఏళ్ల క్రితం జీవించిన ఈ శాకాహార డైనోసార్‌ను నోడోసార్ జాతికి చెందినదిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం దీనిని రాయల్ టైరెల్ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు.

ఈ శిలాజానికి ‘బోరేలోపేల్తా మార్కుమిట్చెల్య్’ అనే శాస్త్రీయ నామాన్ని పెట్టారు. శిలాజాన్ని వెలికితీసి, అత్యంత జాగ్రత్తగా శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషించిన టెక్నీషియన్ మార్క్ మిచెల్‌కు గౌరవంగా ఈ పేరు పెట్టారు. దాని సిద్ధీకరణకు ఆయన వేల గంటల సమయం వెచ్చించినట్లు మ్యూజియం సమాచారం పేర్కొంటోంది.

ఈ డైనోసార్ ప్రత్యేకత దాని శరీర సంరక్షణలోనే ఉంది. చర్మంపై ఉన్న పొలుసులు, రక్షణ కవచం, శరీర ఆకృతి మాత్రమే కాకుండా పొట్ట ప్రాంతంలో పేగుల ఆనవాళ్లు కూడా గుర్తించారు. ఇలాంటి అంతర్గత భాగాల జాడలు నోడోసార్ శిలాజాల్లో కనిపించడం అత్యంత అరుదైన విషయంగా పరిశోధకులు పేర్కొంటున్నారు.

డైనోసార్ మరణించిన తర్వాత నీటిలోకి చేరి, సముద్రపు అవక్షేపాలు, ఖనిజాలతో వేగంగా కప్పబడటం వల్లే ఇంత అద్భుతంగా సంరక్షించబడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

మరో ఆసక్తికర అంశం దాని చర్మంపై కనిపించిన రంగుల నమూనా. పైభాగంలో ముదురు రంగు, కింది భాగంలో లేత రంగు ఉండే కౌంటర్‌షేడింగ్ లక్షణాలు గుర్తించారు. ఇది పరిసరాల్లో కలిసిపోయేందుకు, వేటాడే జంతువుల నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడే సహజ మభ్యపెట్టే విధానమై ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

ఎముకలకే పరిమితం కాకుండా శరీరంలోని మృదువైన భాగాల ఆనవాళ్లను కూడా అందించిన ఈ శిలాజం.. డైనోసార్లు నిజంగా ఎలా కనిపించేవి, అవి ఎలా జీవించేవి అనే విషయాలపై మరింత స్పష్టమైన అవగాహన కల్పించే అరుదైన శాస్త్రీయ ఆధారంగా నిలిచింది.