- దీని వెనుక ఆసక్తికరమైన చరిత్ర!
ఇంగ్లీషులో Quick, Queen, Question, Quiet వంటి పదాలను గమనిస్తే Q తర్వాత దాదాపు ఎప్పుడూ U అక్షరం కనిపిస్తుంది. ఇది కేవలం స్పెల్లింగ్ రూల్ కాదు. వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైన భాషా పరిణామం దీనికి కారణం. ప్రాచీన రోమన్ భాష అయిన లాటిన్ నుంచి ఈ సంప్రదాయం ఇంగ్లీషులోకి వచ్చింది.
లాటిన్ భాషలో మొదలైన సంప్రదాయం
ప్రాచీన రోమన్లు మాట్లాడే లాటిన్ భాషలో Q అక్షరాన్ని సాధారణంగా Uతో కలిపి రాసేవారు. ఈ QU కలయిక ‘క్వ్’ అనే ధ్వనిని సూచించేది. ఉదాహరణకు, లాటిన్లో Qui అంటే ‘ఎవరు’, Quattuor అంటే ‘నాలుగు’.
ఆ సమయంలో ఈ ధ్వనిని సూచించడానికి ప్రత్యేక అక్షరం లేకపోవడంతో Q, Uలను కలిపి ఉపయోగించేవారు. క్రమంగా ఈ పద్ధతి లాటిన్ రాతలో స్థిరపడింది. తరువాత ఇతర యూరోపియన్ భాషలపై కూడా దీని ప్రభావం పడింది.
ఫ్రెంచ్ భాష ప్రభావంతో ఇంగ్లీషులోకి
ఇంగ్లీషు భాష ఒక్క భాష ప్రభావంతోనే అభివృద్ధి చెందలేదు. జర్మానిక్ భాషలు, లాటిన్, ఫ్రెంచ్ వంటి భాషల నుంచి అనేక పదాలు ఇందులో చేరాయి.
1066లో నార్మన్ ఆక్రమణ తర్వాత ఫ్రెంచ్, లాటిన్ మూలాలున్న పదాలు పెద్ద సంఖ్యలో ఇంగ్లీషులోకి వచ్చాయి. వాటిలో చాలావరకు QU స్పెల్లింగ్‌తో ఉండటంతో ఇంగ్లీషులోనూ అదే పద్ధతి కొనసాగింది. Quality, Quantity, Quarter, Question, Quest, Quote, Quit, Equal వంటి పదాల్లో ఈ ప్రభావాన్ని చూడవచ్చు. కాలక్రమేణా ఇంగ్లీషు స్పెల్లింగ్‌కు నిర్దిష్ట రూపం ఏర్పడినా, Q తర్వాత U రాసే సంప్రదాయం అలాగే నిలిచిపోయింది.
Q తర్వాత U లేకుండా వచ్చే పదాలు కూడా ఉన్నాయి
ఇంగ్లీషులో Q తర్వాత U రావడం సాధారణమైనప్పటికీ, దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ముఖ్యంగా ఇతర భాషల నుంచి వచ్చిన కొన్ని పదాల్లో Q తర్వాత U ఉండదు.
ఉదాహరణకు:qatar – ఖతార్ దేశం పేరు
Iraq , qi – చైనీస్ తత్వశాస్త్రంలో జీవశక్తిని సూచించే పదం,
Qigong – శ్వాస, కదలికలు, ధ్యానంతో సంబంధం ఉన్న చైనీస్ అభ్యాసం
Qintar – అల్బేనియా కరెన్సీకి సంబంధించిన ఒక ద్రవ్య ప్రమాణం
Qaid – నాయకుడు లేదా అధికారి అనే అర్థంలో ఉపయోగించే పదం
Qanat– భూగర్భ జలాలను తరలించే సంప్రదాయ నీటి వ్యవస్థ
ఈ పదాలు వేర్వేరు భాషల నుంచి ఇంగ్లీషులోకి రావడంతో వాటి అసలు స్పెల్లింగ్, ఉచ్చారణ లక్షణాలు చాలావరకు అలాగే కొనసాగాయి.
ఇప్పటికీ ఈ పద్ధతి ఎందుకు కొనసాగుతోంది?
ఇంగ్లీషులో Q అక్షరం చాలా తక్కువగా ఉపయోగించినప్పటికీ, అది కనిపించినప్పుడు సాధారణంగా Uతో కలిసి ఉంటుంది. ఈ కలయికను చూసిన వెంటనే పాఠకులు దాన్ని ఒక నిర్దిష్ట ధ్వనితో అనుసంధానించగలుగుతారు. దీనివల్ల పదాలను గుర్తించడం, చదవడం సులభమవుతుంది. భాషలో ఉచ్చారణలు కాలక్రమేణా మారినా, పాత స్పెల్లింగ్ పద్ధతులు చాలావరకు అలాగే కొనసాగుతాయి. Q, Uల కలయిక కూడా అలాంటి చారిత్రక సంప్రదాయమే.
