నిజానికి మన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిన చిన్ననాటి జ్ఞాపకాలు పెద్దయ్యాక గుర్తుండవు. దీన్నే ‘ఇన్ఫాంటైల్ అమెనిషియా’ లేదా ‘చైల్డ్‌హుడ్ అమెనిషియా’ అంటారు. సాధారణంగా పెద్దవాళ్లకు మూడేళ్ల వయసు కంటే ముందు జరిగిన సంఘటనలు చాలా తక్కువగా గుర్తుంటాయి. మూడు నుంచి ఏడేళ్ల మధ్య జరిగిన సంఘటనలు పూర్తిగా కాకుండా కొన్ని భాగాలు మాత్రమే గుర్తుంటాయి. అయితే దీనర్థం చిన్న పిల్లలకు జ్ఞాపకశక్తి ఉండదని కాదు.
చాలాకాలం వరకు శాస్త్రవేత్తలు పిల్లల మెదడు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వారు ఎక్కువకాలం నిలిచే జ్ఞాపకాలను ఏర్పరచుకోలేరని భావించారు. కానీ ఇటీవలి పరిశోధనలు ఈ అభిప్రాయాన్ని మార్చాయి.
2025లో ‘సైన్స్’ జర్నల్‌లో ప్రచురితమైన యేల్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం, చిన్న పిల్లలు కూడా ఒక సంఘటనకు సంబంధించిన జ్ఞాపకాలను గుర్తుంచుకుంటారు. ఈ పరిశోధనలో 4 నెలల నుంచి 2 సంవత్సరాల వయసున్న 26 మంది పిల్లలను పరిశీలించారు.
పిల్లలకు మనుషుల ముఖాలు, వస్తువులు, వివిధ దృశ్యాల ఫొటోలను చూపించారు. కొంతసేపటి తర్వాత అదే ఫొటోతో పాటు కొత్త ఫొటోను చూపించారు. పిల్లలు ఏ ఫొటోను ఎంతసేపు చూస్తున్నారో పరిశోధకులు గమనించారు. అదే సమయంలో మెదడులో జ్ఞాపకాలకు ముఖ్యమైన హిప్పోకాంపస్ అనే భాగంలో జరుగుతున్న మార్పులను ఫంక్షనల్ ఎంఆర్ఐ ద్వారా పరిశీలించారు.
పిల్లలు ఒక ఫొటోను మొదటిసారి చూస్తున్నప్పుడు హిప్పోకాంపస్‌లో ఎక్కువ చురుకుదనం కనిపిస్తే, తర్వాత అదే ఫొటోను గుర్తించే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. అంటే పిల్లలు చిన్న వయసులోనే జ్ఞాపకాలను ఏర్పరచుకోగలరని ఈ పరిశోధన సూచించింది. పెద్దయ్యాక ఆ జ్ఞాపకాలు మనకు ఎందుకు గుర్తుండవు? ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. సమస్య చిన్న పిల్లలు జ్ఞాపకాలను సృష్టించలేకపోవడం కాకపోవచ్చు. వారి మెదడు పెరుగుతున్న కొద్దీ ఆ జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసుకోవడం కష్టమవుతుంది.
హిప్పోకాంపస్ పాత్ర ఏమిటి?
మన మెదడులో లోతుగా ఉండే హిప్పోకాంపస్ అనే భాగం గుర్రం ఆకారంలో ఉంటుంది. మనం ఒక సంఘటనను జ్ఞాపకంగా ఏర్పరచుకోవడంలో, తర్వాత దాన్ని గుర్తు చేసుకోవడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.హిప్పోకాంపస్ చిన్ననాటి నుంచి బాల్యం వరకు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. జ్ఞాపకశక్తికి ఇది ఒక్కటే కారణం కాదు. అయితే ఈ భాగంలో జరిగే మార్పులు చిన్ననాటి జ్ఞాపకాలు ఎలా నిల్వ అవుతాయి, తర్వాత వాటిని ఎలా గుర్తు చేసుకుంటాం అనే విషయాలపై ప్రభావం చూపుతాయని పరిశోధకులు భావిస్తున్నారు.
ఆరేళ్ల వయసులో పాఠశాలలో జరిగిన ఒక సంఘటన మనకు గుర్తుండవచ్చు. కానీ మనం చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఎవరో ఎత్తుకున్న సంఘటన మాత్రం గుర్తుండదు .
మెదడు వేగంగా మారడం కూడా ఒక కారణం
జీవితంలోని మొదటి సంవత్సరాల్లో మెదడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. నాడీకణాల మధ్య కొత్త సంబంధాలు ఏర్పడతాయి. కొన్ని సంబంధాలు బలపడతాయి. మరికొన్ని తగ్గిపోతాయి. మెదడులో ఇలాంటి మార్పులు నిరంతరం జరుగుతుండటం వల్ల చిన్ననాటి జ్ఞాపకాలు అంత స్థిరంగా ఉండకపోవచ్చని ఒక సిద్ధాంతం చెబుతోంది. మెదడు తనను తాను మార్చుకుంటున్న కొద్దీ జ్ఞాపకాలను నిల్వ చేయడం, తిరిగి గుర్తు చేసుకోవడంలో ఉపయోగపడే నాడీ వ్యవస్థలు కూడా మారుతూ ఉంటాయి. ఇదే విషయానికి సంబంధించి ఎలుకలపై చేసిన ఒక పరిశోధనలో, పెద్ద ఎలుకల్లో కొత్త నాడీకణాల ఏర్పాటును పెంచితే పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం కష్టమవుతుందని గుర్తించారు. చిన్న ఎలుకల్లో ఈ ప్రక్రియను తగ్గిస్తే అవి జ్ఞాపకాలను ఎక్కువకాలం నిలుపుకున్నాయి. అయితే ఈ ఫలితాల ఆధారంగా మనుషుల్లో చిన్ననాటి జ్ఞాపకాలు మాయమవడానికి ఇదే పూర్తిస్థాయి కారణమని చెప్పలేం. జంతువుల మెదడు, మనుషుల మెదడు అభివృద్ధి ఒకేలా ఉండదు. మనుషుల జ్ఞాపకశక్తిపై భాష, కుటుంబం, సామాజిక సంబంధాలు వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి.
భాష ముఖ్యమే
చిన్న పిల్లలు మాట్లాడటం రాకముందే జ్ఞాపకాలను ఏర్పరచుకోగలరు. ఉదాహరణకు ఒక పరిచయమైన ముఖం, శబ్దం లేదా ప్రతిరోజూ జరిగే ఒక అలవాటును వారు గుర్తించవచ్చు. కానీ ఆ అనుభవాన్ని మాటల్లో చెప్పలేరు.
పెద్దవాళ్లు సాధారణంగా ఒక సంఘటనను ఒక కథలా గుర్తు చేసుకుంటారు. ఎక్కడ ఉన్నాం, ఏం జరిగింది, మనకు ఎలా అనిపించింది వంటి వివరాలతో జ్ఞాపకాన్ని చెప్పగలుగుతారు. పిల్లలు భాష నేర్చుకుంటున్న కొద్దీ తమ అనుభవాలను మాటల్లో చెప్పడం, వాటిని ఒక కథలా గుర్తుంచుకోవడం నేర్చుకుంటారు.
అన్ని జ్ఞాపకాలు ఒకేలా ఉండవు
ఒక సంఘటనను గుర్తుంచుకోవడం, ఒక పని ఎలా చేయాలో గుర్తుంచుకోవడం రెండూ వేర్వేరు. మనస్తత్వ శాస్త్రంలో వీటిని సాధారణంగా ఎపిసోడిక్ మెమరీ, ప్రొసీజరల్ మెమరీగా చెబుతారు. ఎపిసోడిక్ మెమరీ అంటే ఒక నిర్దిష్ట సంఘటనను గుర్తు చేసుకోవడం. ఉదాహరణకు పుట్టినరోజు వేడుక, పార్కుకు వెళ్లిన సందర్భం వంటి వాటిని గుర్తు చేసుకోవడం. ప్రొసీజరల్ మెమరీ అంటే ఒక పని ఎలా చేయాలో గుర్తుండటం. ఉదాహరణకు సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, స్పూన్‌తో తినడం వంటివి.మనకు గుర్తుండని చిన్ననాటి ప్రపంచం కూడా మనం ఈరోజు ఉన్న వ్యక్తిగా మారడంలో ఒక ముఖ్యమైన భాగమే.
