స్వచ్ఛందంగా వేశ్యగా మారడం నేరం కాదన్న సుప్రీంకోర్టు

supreme court verdict

స్వచ్ఛందంగా వ్యభిచార వృత్తిని (వేశ్యావృత్తి) ఎంచుకోవడం నేరం కాదని సుప్రీం కోర్టు స్పష్టం  చేసింది. ఈ మేరకు ఒక పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ జె.బి. పర్దివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది .  వయోజనులు తమ ఇష్టపూర్వకంగా ఈ వృత్తిని చేసుకునే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

18 సంవత్సరాలు నిండిన లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిని వయోజనులుగా పరిగణిస్తారు. లైంగిక కార్మికులు కూడా భారత రాజ్యాంగం ప్రకారం గౌరవం, సమాన రక్షణ పొందే హక్కు కలిగిన వృత్తి నిపుణులు అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.

పోలీసుల వేధింపులకు అడ్డుకట్ట:

సెక్స్ వర్కర్లు స్వచ్ఛందంగా ఈ వృత్తిలో ఉన్నప్పుడు వారిని పోలీసులు వేధించడం, అరెస్టు చేయడం లేదా శిక్షించడం చేయకూడదని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.  దాడులు (రైడ్స్) జరిగినప్పుడు వారిని బలవంతంగా రెస్క్యూ హోమ్స్ లేదా షెల్టర్లకు తరలించరాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది .

లైంగిక కార్మికులకు చట్టపరమైన హక్కులు ఉన్నప్పటికీ, వ్యభిచార గృహాలు (Brothels) నడపడం, ఇతరులను బలవంతంగా లేదా అక్రమ రవాణా (Human Trafficking) ద్వారా ఈ కూపంలోకి దించడం చట్టరీత్యా నేరం అని సుప్రీం కోర్టు చెప్పింది .  అదేవిధంగా కండోమ్‌లు కలిగి ఉండటం సె*క్స్ వర్కర్‌కు వ్యతిరేకంగా నేరంగా పరిగణించరాదని… వారి ప్రైవసీని దెబ్బతీసేలా పోలీసులు వ్యవహరించవద్దని సుప్రీం కోర్టు సూచించింది.