30న కాకినాడలో స్వరార్చన

swararchana

 కాకినాడ : కాకినాడ లో స్వరార్చన కార్యక్రమం జరుగుతుందని  పెద్దిరెడ్డి గంగాధర మాస్టర్  కుమారుడు పెద్దిరెడ్డి సతీష్ తెలిపారు. ఆర్కెస్ట్రా పితామహుడుగా రాష్ట్రవ్యాప్తంగా పేరెన్నికగన్నపెద్దిరెడ్డి గంగాధరం  మాస్టర్ 88వ జయంతి పురస్కరించుకుని  స్వరార్చన కార్యక్రమం ఈనెల 30వ తేదీ శనివారం సాయంత్రం స్థానిక సినిమారోడ్డు సూర్యకళా మందిరంలో జరగనున్నది . వేలాదిగా సంగీత విభావరి  కార్యక్రమాలు దేశ విదేశాల్లో నిర్వహించిన  ఘనత గంగాధర్ మాస్టర్ దే. 

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో  తొలిసారిగా 1955లో  ఆర్కెస్ట్రాను స్థాపించారు. ఆయన  అప్పటి తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామం సమీపంలోని హసన్ బాద్  గ్రామంలో 1937లో జన్మించారు.  సంగీతంపై మక్కువతో చించినాడ సన్యాసిరావు వద్ద  కర్ణాటక సంగీతం, ఆకుల నరసింహారావు వద్ద హిందూస్తానీ సంగీతం, హార్మోనియం  నేర్చుకున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఐదుగురి  సభ్యులతో  తొలి ఆర్కెస్ట్రాన్ని ప్రారంభించి ప్రతి సంవత్సరం   వందలకు పైగా వివిధ రాష్ట్రాలు,  దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు.

సుప్రసిద్ధ గాయనిగాయకులు బాలసుబ్రహ్మణ్యం , ఏసుదాసు, ఎస్పీ శైలజ సహా  ప్రముఖ సినీ గాయనీ, గాయకులు  వివిధ సందర్భాల్లో  ఎన్నోసార్లు మాస్టర్ గారితో కలిసి వివిధ ప్రదర్శనలలో పాల్గొన్నారు. ఎంతోమంది  ఆర్కెస్ట్రా కళాకారులను తీర్చిదిద్దిన గంగాధర మాస్టర్  జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఆయన శిష్యులు, కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం జరగబోయే కార్యక్రమానికి గంగాధరం మాస్టర్ శిష్యులు,  కాకినాడ సినీ ఆర్కెస్టా ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈ స్వరార్చన కార్యక్రమంలో  పాల్గొని ఓలలాడించడానికి  సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని   పెద్దిరెడ్డి గంగాధర మాస్టర్  కుమారుడు పెద్దిరెడ్డి సతీష్ కోరారు.