పది రోజులపాటు ప్రత్యేక పూజలు – 20న శమీ వృక్ష పూజ, అమ్మవారి నగరోత్సవం
విజయవాడ ప్రతినిధి : భక్తి, ఆధ్యాత్మిక శోభతో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 11వ తేదీ ఆదివారం నుంచి 20వ తేదీ మంగళవారం వరకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం కల్యాణ మండపం అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో జీయస్ రాజు రోడ్డు లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పది రోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ విషయాన్ని మందిర ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తుమ్మలపెంట శ్రీనివాస్ వెల్లడించారు.
ప్రతిరోజూ విశేష పూజలు
శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అర్చనలు, కుంకుమార్చనలు నిర్వహించనున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. రోజుకో ప్రత్యేక అలంకరణలో వాసవి అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
ఉదయం 8 గంటలకు గోపూజ, 8.30 గంటలకు దేవాలయ ప్రదక్షిణ, 9 గంటలకు కుంకుమ పూజ, 11 గంటలకు మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు సువాసినీ పూజ, 7.30 గంటలకు పంచహారతులు సమర్పించి, అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపడతారు.
20న శమీ వృక్ష పూజ – అమ్మవారి ఊరేగింపు
ఉత్సవాల ముగింపు రోజైన ఈ నెల 20వ తేదీన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 7 గంటలకు శమీ వృక్ష పూజ నిర్వహించిన అనంతరం వాసవి అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించనున్నారు. ఈ కార్యక్రమం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ముఖ్య అతిథులుగా ప్రజాప్రతినిధులు
ఈ ఉత్సవాల్లో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు కమిటీ అధ్యక్షుడు తెలిపారు.
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వాసవి అమ్మవారిని దర్శించుకోవాలని, ఆమె కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని తుమ్మలపెంట శ్రీనివాస్ కోరారు. పది రోజులపాటు ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా ఉత్సవాలను నిర్వహించేందుకు కమిటీ ఏర్పాట్లు చేస్తోంన్నారు.
