నిర్లక్ష్యం చేయరాని థైరాయిడ్ సమస్య .. హైపోథైరాయిడిజం

Samaram

-డాక్టర్ సమరం

విజయవాడ: భారతదేశంలో ప్రతి పది మందిలో ఒకరు హైపోథైరాయిడిజం సమస్యతో బాధపడుతున్నారని, పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని డాక్టర్ సమరం తెలిపారు. సాధారణ రక్త పరీక్షల ద్వారా ఈ వ్యాధిని సులభంగా గుర్తించి, సరైన చికిత్స తీసుకుంటే పూర్తిగా నియంత్రణలో ఉంచవచ్చని ఆయన పేర్కొన్నారు.

వాసవ్య నర్సింగ్ హోంలో డి. రవికుమార్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన ఆరోగ్య సదస్సులో ‘హైపోథైరాయిడిజం’ అంశంపై డాక్టర్ సమరం ప్రసంగించారు. మెడ ముందు భాగంలో ఉండే సీతాకోకచిలుక ఆకారంలోని థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే థైరాక్సిన్ (టీ4), ట్రైఐయోడోథైరోనిన్ (టీ3) హార్మోన్లు శరీర జీవక్రియలు, గుండె పనితీరు, మెదడు, కండరాలు, శరీర ఉష్ణోగ్రత, శక్తి వినియోగాన్ని నియంత్రిస్తాయని చెప్పారు. ఈ హార్మోన్లు తగినంతగా ఉత్పత్తి కాకపోవడాన్ని హైపోథైరాయిడిజంగా పేర్కొన్నారు.

ఆటో ఇమ్యూన్ వ్యాధులు, అయోడిన్ లోపం లేదా అధికంగా తీసుకోవడం, థైరాయిడ్ శస్త్రచికిత్స, రేడియో అయోడిన్ చికిత్స, కొన్ని మందుల దుష్ప్రభావాలు, పుట్టుకతోనే థైరాయిడ్ లోపం, కుటుంబంలో ఈ వ్యాధి చరిత్ర ఉండటం వంటి కారణాల వల్ల హైపోథైరాయిడిజం వచ్చే అవకాశాలు ఉంటాయని వివరించారు.

అలసట, నిద్రమత్తు, బరువు పెరగడం, చలిని తట్టుకోలేకపోవడం, మలబద్ధకం, ముఖం, కాళ్లు ఉబ్బడం, చర్మం పొడిబారడం, జుట్టు రాలిపోవడం, గొంతు బొంగురుగా మారడం, జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం, డిప్రెషన్, మహిళల్లో నెలసరి అవకతవకలు, గర్భం ధరించడంలో ఇబ్బందులు, పురుషుల్లో లైంగిక ఆసక్తి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు.

టీఎస్హెచ్, ఫ్రీ టీ4, అవసరమైతే ఫ్రీ టీ3, థైరాయిడ్ యాంటీబాడీ పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చని తెలిపారు. గర్భిణుల్లో థైరాయిడ్ హార్మోన్ లోపం తల్లి ఆరోగ్యంతో పాటు గర్భస్థ శిశువు మెదడు ఎదుగుదలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, వైద్యుల సలహా మేరకు పరీక్షలు చేయించుకుని చికిత్స పొందాలని సూచించారు.

హైపోథైరాయిడిజం ఉన్నవారు లివోథైరాక్సిన్ మాత్రను ప్రతిరోజూ ఉదయం పరగడుపున వైద్యుల సూచన మేరకు తీసుకోవాలని, వైద్యుల సలహా లేకుండా మందులను ఆపడం లేదా మోతాదును మార్చడం చేయకూడదని హెచ్చరించారు. చాలా మందికి ఈ చికిత్స జీవితాంతం అవసరమవుతుందని చెప్పారు.

సమతుల ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, బరువు నియంత్రణ, అవసరమైన వారు అయోడిన్ కలిగిన ఉప్పు వినియోగం వంటి జీవనశైలి మార్పులు కూడా వ్యాధి నియంత్రణలో కీలకమని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, గర్భిణులు, కుటుంబంలో థైరాయిడ్ సమస్యల చరిత్ర ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం సదస్సులో పాల్గొన్న వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి సందేహాలను నివృత్తి చేశారు.