సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని స్నేహా గార్డెన్లో పార్టీ శ్రేణులకు రాష్ట్రస్థాయి రాజకీయ, సైద్ధాంతిక శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తెలిపారు . ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, మార్క్సిస్టు అధ్యయన కేంద్రాల నుంచి ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలపై బోధించేందుకుగాను ప్రముఖులు ఉపాధ్యాయులుగాను, ఏపీ, తెలంగాణ నుంచి మేధావులు విచ్చేస్తారని తెలిపారు.
విజయవాడ దాసరి భవన్లో ఈశ్వరయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులకు రాష్ట్రంలోని 28 జిల్లాల నుంచి పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర సమితి సభ్యులు, ప్రజా సంఘాల బాధ్యులు ప్రతినిధులుగా హాజరవుతారని తెలిపారు. వర్తమాన రాజకీయ అంశాలపై, ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ స్థితిగతులపైన అధ్యయనం చేసేందుకు, కేంద్రంలోని, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగట్టేందుకుగాను,రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యాన జూన్ 1వ తేదీన జరిగే పోరాటానికి సిపిఐ రాష్ట్ర సమితి సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నదన్నారు.
జూన్ 1 నుంచి 7వ తేదీ వరకు రాష్ట్రంలోని పది వామపక్షాల నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ; ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు. 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పది వామపక్షాల నేతృత్వంలో రాస్తారోకోలకు పిలుపునిచ్చినట్లు చెప్పారు .
ప్రధాని మోదీ వికసిత్ భారత్, సీఎం చంద్రబాబు వికసిత్ ఆంధ్రప్రదేశ్ పేర్లతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. 2014లో మోడీ అధికారం చేపట్టేనాటికి భారతదేశం అప్పు కేవలం రూ.55 లక్షల కోట్లుకాగా, గత 12 ఏళ్లల్లో రూ.310 లక్షల కోట్లకు దేశ అప్ప్పులు పెంచేసిన ఘనత మోడీకే దక్కుతుందని విమర్శించారు. మోడీ గత 12 ఏళ్లల్లో చేసిన అప్ప్పులతో దేశంలోని తల ఒక్కింటికి రూ.1.45,000 భారం పడిందన్నారు.
2012 వరకు లక్షా 70 వేల రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, 2024 నాటికి రైతుల ఆత్మహత్యలు 4 లక్షల 76 వేలకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. దాదాపు 300 శాతానికి ధరలు పెరిగిపోయాయని, ఈ ప్రభుత్వం ధరల నియంత్రణలో విఫలమైందని విమర్శించారు. ప్రజలపై పన్నులు మోత విపరీతంగా పెరిగిపోయిందని, 2014లో 17.94 లక్షల కోట్ల పన్నులు ఉండగా, ఈ 12 సంవత్సరాల్లో రూ.35 లక్షల కోట్లకుపైగా ప్రజలపై భారం మోపారని తెలిపారు. పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరిగి, సామాన్యుడి నెత్తిన భారం మోపారని, పెట్రోలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు పెట్రోలియం శాఖ విధించే ట్యాక్స్‌ను తగ్గిస్తే..ఇవాళ లీటర్ రూ.55 కే పెట్రోలు విక్రయించే పరిస్థితి ఉంటుందని సూచించారు.
నాడు యువగళం పాదయాత్రలో లోకేశ్ తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల నియంత్రణలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం మౌనంగా ఉందన్నారు. ఒక వైపు గ్యాస్ కొరత ఏర్పడుతుండగా ఎపీలోని రాజమండ్రి సమీపంలో రిలయన్స్ గ్యాస్‌ను ఓఎన్జీసీకి అప్పగించకుండా గుజరాత్‌కు తరలించుకుపోతున్నారన్నారు. దానిని ఓన్జీసీకి అప్పగించి మన రాష్ట్ర వాటా 50 శాతాన్ని కాపాడుకుంటే ఇంత పెద్ద ఎత్తున ధరలు పెరిగే ఆస్కారం ఉండేది కాదని సూచించారు. పైగా రిలయెన్స్ కంపెనీ అక్రమాలకు పాల్పడిందని రూ.25 వేల కోట్ల ఫైన్ వేసినప్పటికీ ఈ ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదన్నారు. చంద్రబాబు చెప్పే మాటలు వేరు..ఆచరణలో అమలు చేసేవీ వేరుగా ఉన్నాయని అన్నారు. ఒక వైపు ఏపీఎసఆర్టీసీ ప్రైవేటీకరించేందుకుగాను ఆ సంస్థ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ ముందుకెళ్తున్నారని, మరోవైపు ఆర్టీసీ ఉన్నతాధికారులు, మంత్రి సైతం విద్యుత్ బస్సులు వస్తున్నాయంటూ ప్రకటిస్తున్నారని చెప్పారు. ఆర్టీసీకి 28 జిల్లాల్లో దాదాపు లక్ష కోట్లకుపైగా ఆస్తులున్నాయని, దానిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం కన్నేసి, ప్రైవేటీకరణ ముసుగులో వాటిని అమ్ముకునేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు.
పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై 1వ తేదీ నుంచి 7 వరకు వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార కార్యక్రమాలు, 9న రాస్తారోకోలలో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.దుర్గాభవాని, దోనేపూడి శంకర్ పాల్గొన్నారు.
