పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
అధిక జేష్ట్యమాస పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఆదివారం ఎంతో వైభవంగా జరిగింది.
దుర్గా మల్లేశ్వరులు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయస్వామి వంటి దేవతలు కొలువైన
ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.
పౌర్ణమి నాడు సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రిగిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టమని పండితులు చెబుతున్నారు.పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఘాట్ రోడ్డు ప్రారంభంలోని శ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవముగా ప్రారంభం అయింది.
ఆలయ కార్యనిర్వహణాధికారి శీనానాయక్ దంపతులు ప్రత్యేక పూజలు chesi, కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. దేవస్థానం స్థానాచార్య వి. శివ ప్రసాద్ శర్మ, ముఖ్య అర్చకులు ఆర్. శ్రీనివాసశాస్త్రి తదితరులు పూజలు నిర్వహించారు.
ధర్మ ప్రచారం నిమిత్తం దేవస్థానం ఏర్పాటు చేసిన సంప్రదాయ తప్పెట్లు, కోలాట నృత్యప్రదర్శనలు, భజన సంకీర్తనా గానం వంటి కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళవాయిద్యముల, వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ గిరి ప్రదక్షిణ వైభవంగా సాగింది.
ఘాట్ రోడ్ శ్రీ అమ్మవారి గుడి,కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాలప్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణవీధి నుంచి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరిప్రదక్షిణ కొనసాగింది.
దుర్గా మల్లేశ్వరులు కొలువైన వాహనం ముందు రహదారులను వివిధ ప్రాంతాల్లో మహిళలు పసుపు నీళ్లతో శుద్ధి చేసి, హారతులు, కొబ్బరికాయలు సమర్పించి, జయ జయద్వానాలు చేశారు.గిరి ప్రదక్షిణ మార్గమంతా భక్తులకు అమ్మవారి కుంకుమ, ప్రసాదంను భక్తులకు దేవస్థానం నుంచి అందజేశారు.
వేలాది మంది భక్తులు పాల్గొని, అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నారు.
