ఒకరి నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగు

Eyesite

నేత్రదానాన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాలి: డాక్టర్ జి. సమరం

విజయవాడ, తెలుగు వేవ్ ప్రతినిధి : నేత్రదానం మనిషిలోని మానవత్వానికి ప్రతీక అని, ఒక వ్యక్తి నేత్రదానంతో ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగు నింపవచ్చని ప్రముఖ వైద్యులు, స్వేచ్ఛా గోరా ఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జి. సమరం అన్నారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 8 వరకు నిర్వహిస్తున్న నేత్రదాన ప్రచార పక్షోత్సవాలను పురస్కరించుకుని వాసవ్య నర్సింగ్ హోం, స్వేచ్ఛా గోరా ఐ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలోని వాసవ్య నర్సింగ్ హోంలో ఆరోగ్య సదస్సు నిర్వహించారు. డి. రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో డాక్టర్ సమరం ‘నేత్రదానం’ అంశంపై ప్రసంగించారు. అమూల్యమైన నేత్రాలను మట్టిపాలు, బుగ్గిపాలు చేయకుండా మరణానంతరం దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.మరణించిన తర్వాత కూడా చేయగలిగే అమూల్యమైన దానాల్లో నేత్రదానం ప్రత్యేకమైనదని ఆయన పేర్కొన్నారు. నేత్రదానం అంటే మరణించిన వ్యక్తి నేత్రాలను దానం చేయడమే తప్ప, జీవించి ఉన్నవారి నేత్రాలను దానం చేయడం కాదని స్పష్టం చేశారు. నేత్రదానం ద్వారా చూపు పొందే అవకాశం ఉన్నవారు దేశంలో సుమారు 15 లక్షల మంది ఉన్నారని తెలిపారు. దేశంలో ఏటా దాదాపు కోటి మంది మరణిస్తున్నప్పటికీ, కేవలం 35 వేల మంది నుంచి మాత్రమే నేత్రదానం జరుగుతోందన్నారు.

ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలు, మతపరమైన అపోహలు, భయాలు నేత్రదానానికి ప్రధాన అవరోధాలుగా మారుతున్నాయని డాక్టర్ సమరం ఆవేదన వ్యక్తం చేశారు. నేత్రదానంపై విస్తృత స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఒక సంవత్సరాన్ని ‘నేత్రదాన సంవత్సరం’గా ప్రకటించి పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడితే దేశంలో కార్నియా సంబంధిత అంధత్వాన్ని దాదాపుగా నిర్మూలించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

నేత్రదానం ప్రతి ఒక్కరి చివరి కోరికగా మారాలని, దానిని సామాజిక బాధ్యతగా స్వీకరించి నేత్రదాన ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అప్పుడే లక్షలాది మంది అంధుల జీవితాల్లో వెలుగు నింపగలుగుతామని పేర్కొన్నారు.