బంధాల నుంచి గౌరవం వరకు.. జీవితాన్ని శాసిస్తున్న ఆర్థిక శక్తి
ఒకప్పుడు మనిషికి గౌరవం రావడానికి వయసు, వ్యక్తిత్వం, మంచితనం, అనుభవం ప్రధాన కారణాలుగా ఉండేవి. పెద్దలను గౌరవించడం, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడం, బంధాలకు విలువ ఇవ్వడం సమాజంలో సహజమైన విషయాలు. కాలం మారుతున్న కొద్దీ పరిస్థితులు కూడా మారుతున్నాయి. నేటి సమాజంలో మనిషి స్థాయిని అతని ఆదాయం, ఆస్తి, ఆర్థిక సామర్థ్యంతో కొలిచే పరిస్థితి కనిపిస్తోంది.
డబ్బు అనేది మనిషి జీవితంలో తప్పనిసరి సాధనం. విద్యకు ఫీజుగా, ప్రభుత్వానికి పన్నుగా, బ్యాంకు నుంచి తీసుకుంటే రుణంగా, పని చేసినందుకు జీతంగా, న్యాయస్థానం విధిస్తే జరిమానాగా మారుతుంది. సందర్భాన్ని బట్టి దానికి పేరు మారుతుంది కానీ దాని అసలు స్వరూపం మాత్రం ఒక్కటే. అందుకే డబ్బు మనిషి జీవితంలో ఎంతగా కలిసిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
డబ్బు ఉంటే ఎన్నో అవకాశాలు తలుపులు తెరుస్తాయి. మంచి విద్య, మెరుగైన వైద్యం, సౌకర్యవంతమైన జీవనం, సమాజంలో గుర్తింపు వంటివి సులభంగా అందుబాటులోకి వస్తాయి. అయితే డబ్బు ఒక్కటే జీవితానికి పరిపూర్ణత ఇవ్వదు. సంపద ఉన్నా మనశ్శాంతి లేకపోవచ్చు. చుట్టూ ఎంతోమంది ఉన్నా నిజమైన ఆప్యాయత దొరకకపోవచ్చు.
అత్యంత ఆందోళన కలిగించే విషయం బంధాలపై డబ్బు చూపుతున్న ప్రభావం. ఆర్థిక ప్రయోజనాల కోసం కొత్త పరిచయాలు ఏర్పడటం ఎంత నిజమో, అదే డబ్బు కారణంగా పాత అనుబంధాలు దెబ్బతినడం కూడా అంతే వాస్తవం. ఆస్తి, అప్పులు, సంపాదన, ఖర్చులు వంటి అంశాలు కుటుంబాల్లో విభేదాలకు కారణమవుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి.
డబ్బు సంపాదించడం తప్పు కాదు. అవసరాలకు సరిపడా సంపాదించడం జీవితానికి భద్రతను ఇస్తుంది. కానీ సంపదే జీవితానికి అంతిమ లక్ష్యంగా మారినప్పుడు సమస్య మొదలవుతుంది.డబ్బు కోసం నిజాయితీని, మానవత్వాన్ని, బంధాలను కోల్పోతే సంపాదించిన సంపదకే అర్థం లేకుండా పోతుంది.
మనిషి జీవించి ఉన్నంత కాలం డబ్బు అతని అవసరాలను తీర్చగలదు. కానీ చివరి ప్రయాణంలో వెంట తీసుకెళ్లేది సంపద కాదు. మనం సంపాదించుకున్న మంచి పేరు, మనుషుల ప్రేమ, చేసిన మేలు మాత్రమే. అందుకే డబ్బును జీవితాన్ని సులభతరం చేసే సాధనంగా చూడాలి కానీ జీవితాన్నే డబ్బుగా మార్చుకోకూడదు.
కాలం మారుతోంది, విలువలు మారుతున్నాయి. వయసుకు ఇచ్చే గౌరవం కంటే ఆదాయానికి ఇచ్చే గౌరవం పెరుగుతున్న ఈ రోజుల్లో, మనిషి నిజమైన విలువ అతని బ్యాంకు ఖాతాలో కాదు, అతని మనసులో ఉందనే విషయాన్ని మర్చిపోకూడదు.
డబ్బు విలువ మారలేదు-దాన్ని చూసే మనుషుల విలువే మారింది!
