విజయవాడ ప్రతినిధి: సత్యం, అహింస, మానవత్వం, సేవాభావాన్ని జీవితంలో ఆచరిస్తూ సమాజంలోని బలహీన వర్గాలకు తోడ్పడటమే మహాత్మాగాంధీకి ఇచ్చే నిజమైన నివాళి అని నలంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ అన్నారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, బాపు దర్శన్ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
భారత స్వతంత్ర ఉద్యమం లో గాంధీజీ పోషించిన చారిత్రాత్మక పాత్రను, ఆయన పాటించిన సత్యం, అహింస, శాంతి, సమానత్వం, మానవత్వం వంటి విలువలను అనురాధ వివరించారు. గాంధీజీ జీవితం నేటి సమాజానికి కూడా మార్గదర్శకమని, దేశ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
సదస్సుకు అధ్యక్షత వహించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి. సమరం మాట్లాడుతూగది గాంధీజీని విగ్రహాలకు, జయంతి వేడుకలకు మాత్రమే పరిమితం చేయకుండా ఆయన ఆలోచనలను జీవితంలో ఆచరించాలని అన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంతో పాటు కుల, మత అసమానతలు, అంటరానితనం, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగానూ గాంధీజీ పోరాడారని గుర్తుచేశారు. యువత శాస్త్రీయ దృక్పథంతో పాటు సామాజిక బాధ్యత, మానవత్వం, దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. యువత తమ విద్య, ప్రతిభ, శక్తిని సమాజ ప్రగతికి వినియోగిస్తే గాంధీజీ కలలుగన్న మెరుగైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు.
ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వీర్రాజు మాట్లాడుతూ, హింసకు తావులేకుండా ప్రజలను ఒకే లక్ష్యం వైపు నడిపించి స్వాతంత్ర్యోద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చిన మహనీయుడు గాంధీజీ అని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో ఎదుర్కొన్న అవమానాలు, వివక్ష ఆయనలో పోరాట స్ఫూర్తిని పెంచాయని, భారతదేశానికి తిరిగివచ్చిన తర్వాత సామాన్య ప్రజలను స్వాతంత్ర్యోద్యమంలో భాగస్వాములను చేశారని వివరించారు. సత్యాగ్రహం, అసహకార ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా ప్రజల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం, స్వాతంత్ర్య కాంక్షను పెంపొందించారని తెలిపారు.
సదస్సు సందర్భంగా బాపు దర్శన్‌లో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనలను యువత ఆసక్తిగా తిలకించారు. గాంధీజీ జీవితచరిత్ర, ఆశ్రమాలు, సిద్ధాంతాలు, జైలు జీవితం, రచనలు, పుస్తకాలు, ఆయనపై రూపొందిన సినిమాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విగ్రహాలు, వివిధ భాషల్లోని సంతకాలు, చేతిరాత, స్వరం, ఆయన ఉపయోగించిన వస్తువుల నమూనాలను పరిశీలించారు. భారత స్వాతంత్ర్యోద్యమ యోధులు, తెలుగు స్వాతంత్ర్య సమరయోధులపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలను కూడా వీక్షించారు. ప్రదర్శనల ద్వారా గాంధీజీ జీవితంలోని ముఖ్య సంఘటనలను తెలుసుకోవడం, వక్తల ప్రసంగాలు తమకు స్ఫూర్తినివ్వడం ఆనందంగా ఉందని యువత తెలిపారు.
కార్యక్రమంలో నలంద డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ వై.వి. రావు, ఎస్ఆర్కే ఇంజినీరింగ్ కళాశాల యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ చిన్ని, సకల, పలువురు అధ్యాపకులు, సుమారు 200 మంది యువత పాల్గొన్నారు. సదస్సు ప్రారంభంలో బాపూజీ జీవితం, ఆశయాలపై ప్రదర్శించిన రెండు వీడియో పాటలు సభికులను ఆకట్టుకున్నాయి. రెడ్ క్రాస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డి. రవికుమార్ స్వాగతం పలుకగా, నియంత వందన సమర్పణ చేశారు.
