జీవితంలో ప్రతి ఒక్కరికీ సమస్యలు ఎదురవుతాయి. కొందరికి అవి భయాన్ని కలిగిస్తాయి. మరికొందరికి సవాలుగా కనిపిస్తాయి. ఇంకొందరు మాత్రం అదే సమస్యలో ఓ అవకాశాన్ని వెతుక్కుంటారు. ఈ మూడు రకాల ఆలోచనా విధానాలే మనుషుల మధ్య అసలైన తేడాను సృష్టిస్తాయి.
ఒక కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగికి తరచూ ఒకే రకమైన సమస్య ఎదురవుతోంది. ప్రతిసారీ అతను ఆ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఒకరోజు ఆ సమస్యను నిశితంగా పరిశీలించిన అతనికి అసలు కారణం అర్థమైంది. వెంటనే తన పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లి, శాశ్వత పరిష్కారానికి మార్గం చూపించాడు. ఫలితంగా అతనికే కాదు.. ఆ కార్యాలయంలోని ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలిగింది. ఇదే సాధారణ మనిషికి, మార్పును తీసుకొచ్చే వ్యక్తికి మధ్య ఉన్న తేడా.
సమస్య వచ్చినప్పుడు ఇతరులను నిందించడం సులభం. పరిస్థితులను తప్పుబట్టడం ఇంకా సులువు . కానీ అసలు సమస్య ఎక్కడుంది? దానికి కారణమేంటి? ఈ పరిస్థితి మళ్లీ తలెత్తకుండా ఏం చేయాలి? అని ఆలోచించడం మాత్రం కొంత కష్టమైన పని. అయితే, ఆలోచనలోనే పరిష్కారానికి తొలి అడుగు దాగి ఉంటుంది.
ఒక విద్యార్థి పరీక్షలో విఫలమయ్యాడనుకుందాం. ఆ వైఫల్యాన్ని చూసి చదువును వదిలేస్తే అతను సమస్యకు లొంగిపోయినట్టే. అదే వైఫల్యానికి కారణాలను గుర్తించి, తన లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగితే విజయం సాధించే దిశగా అడుగులు వేసినట్టవుతుంది. తన అనుభవాన్ని ఇతర విద్యార్థులతో పంచుకుని, వారు కూడా అదే తప్పులు చేయకుండా సహాయపడితే.. అతని ప్రయాణం మరెందరికో మార్గదర్శకంగా మారుతుంది. సమస్యను చూసి భయపడితే బాధితుడు.. సమస్యను పరిష్కరిస్తే సమర్థుడు.. అదే సమస్య ఇంకెవరికీ రాకుండా చేస్తే నాయకుడు.
నాయకత్వం అంటే కేవలం పదవి కాదు. ఇతరులు ఎదుర్కొనే ఇబ్బందులను అర్థం చేసుకోవడం, వాటికి పరిష్కారాలు చూపించడం, భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం.
మన ముందుకొచ్చే ప్రతి సమస్య మనల్ని ఓడించడానికి రాదు. మనలోని ఆలోచనా శక్తిని మేల్కొలిపేందుకు వస్తుంది. మన దృక్పథం మారితే సమస్యే ఓ పాఠంగా మారుతుంది. ఆ పాఠం నుంచి నేర్చుకుంటే మన ప్రయాణం విజయవంతమవుతుంది. చివరికి మన భవిష్యత్తును నిర్ణయించేది సమస్యల తీవ్రత కాదు.. వాటిని ఎదుర్కొనే మన ఆలోచనా విధానం!
