దేశవ్యాప్తంగా పొడి వాతావరణం

Clouds

వర్షాల కోసం ఎదురుచూపులు..

నైరుతి రుతుపవనాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి . దీంతో  దేశవ్యాప్తంగా వర్షపాతంలో గణనీయమైన లోటు నమోదైంది. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం జూన్ 4 నుంచి జూన్ 14 వరకు సాధారణంగా 47.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, కేవలం 34.3 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో దేశవ్యాప్తంగా సుమారు 28 శాతం వర్షపాత లోటు ఏర్పడింది.

జిల్లాల వారీగా విడుదల చేసిన వర్షపాత పటాన్ని పరిశీలిస్తే, మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలు, దక్షిణ ద్వీపకల్పంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసినట్లు స్పష్టమవుతోంది. కొన్ని పరిమిత ప్రాంతాల్లో మాత్రమే సాధారణాన్ని మించిన వర్షపాతం నమోదైంది. ఇటీవలి రోజుల్లో రుతుపవనాలు దక్షిణ, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినప్పటికీ, ఆశించిన స్థాయిలో విస్తృత వర్షాలు కురవడం లేదు.

వాతావరణ నిపుణుల విశ్లేషణ ప్రకారం, ప్రస్తుతం గాలిలో తేమకు కొరత లేకపోయినా ఎగువ వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులే ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా ఉత్తర ప్రాంతాల్లో ఉండే వేగవంతమైన వెస్టర్లీ జెట్ స్ట్రీమ్ ఈసారి దక్షిణ దిశగా మరింత కిందకు జరగడం గమనార్హం. ఈ మార్పు ప్రభావంతో భారత ఉపఖండంలో రుతుపవనాల కదలికలకు కీలకమైన ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్  బలహీనపడ్డాయి.

దీని కారణంగా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వర్షపాత వ్యవస్థలు దేశ అంతర్భాగాల్లోకి చొచ్చుకుపోయేందుకు అవసరమైన చోదక శక్తి అందడం లేదు. ఫలితంగా వర్షాలను మోసుకొచ్చే మేఘాలు బలహీనపడటమే కాకుండా, దేశవ్యాప్తంగా విస్తరించకుండా కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి.

రుతుపవనాలు వేగంగా విస్తరించాల్సిన ఈ సమయంలో మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలు, దక్షిణ ద్వీపకల్పంలోని పలు ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతోంది. మరోవైపు వాయువ్య భారతదేశంలోని కొన్ని జిల్లాల్లో స్థానిక వాతావరణ ప్రభావాల కారణంగా అప్పుడప్పుడు చిరు జల్లులు కురుస్తున్నాయి.

మేలో విడుదల చేసిన దీర్ఘకాలిక అంచనాలతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. అనుకూల సముద్ర పరిస్థితుల కారణంగా ఈసారి రుతుపవనాల ప్రారంభం ఆశాజనకంగా ఉంటుందని భావించినప్పటికీ, ఎగువ వాతావరణంలో చోటుచేసుకున్న ఈ మార్పులు రుతుపవనాల వేగాన్ని తగ్గించాయి.

అయితే జూన్ రెండోార్థంపై వాతావరణ శాస్త్రవేత్తలు ఆశాభావంతో ఉన్నారు. జూన్ 20 తర్వాత ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ మళ్లీ బలపడే అవకాశం ఉందని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. అలా జరిగితే బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, ద్రోణులు దేశ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించి రుతుపవనాలకు ఊపునిస్తాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఏర్పడిన ఈ వాతావరణ ప్రతిష్ఠంభన ఎప్పుడు తొలగిపోతుందనే అంశాన్ని శాస్త్రవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు. ఎందుకంటే రాబోయే కొన్ని వారాల పరిస్థితులే ఈ ఏడాది రుతుపవనాల పనితీరు, వ్యవసాయ రంగ భవిష్యత్తు, జలాశయాల నింపుదల వంటి కీలక అంశాలను ప్రభావితం చేయనున్నాయి.