మన దృష్టే.. మన ప్రపంచం!

2345

ఒకే మనిషిని ఇద్దరు వ్యక్తులు చూస్తారు. ఒకరికి అతనిలోని మంచితనం కనిపిస్తుంది. మరొకరికి అతని లోపాలే కనిపిస్తాయి. మనిషి ఒకడే అయినా.. కనిపించే తీరు మాత్రం ఎందుకు మారుతుంది? కారణం మనిషిలో కాదు.. మన దృష్టిలో ఉంటుంది.

మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎదుటివారిలోని చిన్న మంచితనం కూడా పెద్దదిగా కనిపిస్తుంది. అసూయ, కోపం, ద్వేషం మనసును నింపుకున్నప్పుడు మాత్రం ఎదుటివారి గొప్పతనం కూడా లోపంగానే కనిపిస్తుంది. అందుకే మనం ఇతరుల గురించి చేసే ప్రతి తీర్పు.. కొంతవరకు మన అంతరంగానికి అద్దం పడుతుంది.

జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి వ్యక్తి పరిపూర్ణుడు కాదు. మనలోనూ లోపాలున్నట్లే.. ఎదుటివారిలోనూ ఉంటాయి. కానీ వారి లోపాలను మాత్రమే లెక్కపెడుతూ పోతే మనసుకు ప్రశాంతత దొరకదు. ఒక మంచి మాట, ఒక చిన్న సహాయం, ఒక నిజాయితీ, ఒక మానవత్వం కనిపించినా దాన్ని గుర్తించే దృష్టి ఉంటే జీవితం మరింత అందంగా మారుతుంది.

ఎప్పుడైనా ఎవరో మనకు నచ్చకపోతే.. వెంటనే వారిని తప్పుబట్టే ముందు ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి—’నాకు కనిపిస్తున్న ఈ లోపం నిజంగా వారిలోనే ఉందా? లేక నా ఆలోచనల ప్రభావమా?’ ప్రపంచాన్ని మార్చడం మన చేతుల్లో ఉండకపోవచ్చు. కానీ ప్రపంచాన్ని చూసే మన దృష్టిని మాత్రం మార్చుకోవచ్చు. విమర్శించే కళ్లకు లోపాలే కనిపిస్తాయి. ప్రేమించే హృదయానికి మనిషిలోని మంచితనం కనిపిస్తుంది.

అందుకే జీవితంలో గొప్ప మార్పు బయట నుంచి రావాల్సిన అవసరం లేదు. మన దృష్టి మారితే.. మన అనుభవం మారుతుంది. మన ఆలోచన మారితే.. మన ప్రపంచమే మారినట్టవుతుంది.

ఇతరుల్లో మంచిని వెతకడం అంటే వారి లోపాలను సమర్థించడం కాదు. మన మనసును ద్వేషం నుంచి కాపాడుకోవడం. ప్రతి మనిషిలోనూ ఒక వెలుగు ఉందని గుర్తించడం. ప్రపంచం మనకు ఎలా కనిపిస్తుందో కాదు.. మన మనసు ఎలా ఉందో ప్రపంచం అలా కనిపిస్తుంది.