​ఇంద్రకీలాద్రిపై అన్నప్రసాద సదనం, మహాప్రసాదం భవనం ప్రారంభం 

121121

విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం రూ. 52.50 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ‘శ్రీ కనకదుర్గ అన్నప్రసాద సదనం’,  ‘శ్రీ దుర్గా భవాని మహాప్రసాద భవనం’ లను రాష్ట్ర దేవదాయ, ధర్మ దాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి  శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ​అంతకుముందు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి  ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆలయ భవిష్యత్ అభివృద్ధి, రాబోయే ఉత్సవాల ఏర్పాట్లపై కీలక అంశాలను వెల్లడించారు.

ఇంద్రకీలాద్రిపై ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా నివారించేందుకు, అత్యవసర సమయాల్లో రాకపోకలు సజావుగా సాగేలా రెండవ ఘాట్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన సాధ్యాసాధ్యాలను పరిశీలించి, త్వరితగతిన నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కుమ్మరిపాలెంలో ఉన్న 3 ఎకరాల టీటీడీ స్థలాన్ని తీసుకుని దుర్గమ్మ భక్తుల కోసం వినియోగిస్తామని మంత్రి అన్నారు. దుర్గఘాట్ దగ్గర నూతన కేశఖండనశాల నిర్మించేందుకు ప్రతిపాదనలు ఉన్నాయని.. ఇప్పటికే సమీపంలో ఉన్న కార్పొరేషన్ స్థలాన్ని కూడా తీసుకుని భారీ కేశఖండనశాల నిర్మిస్తామన్నారు. ​రాబోయే దసరా ఉత్సవాల ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నామని  తెలిపారు. ​ఈ కార్యక్రమంలో విజయవాడ లోక్‌సభ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), ప్రభుత్వ విప్  యార్లగడ్డ వెంకట్రావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్  కొమ్మారెడ్డి పట్టాభిరామ్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్  బుచ్చి రామ్ ప్రసాద్, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.