ప్రకృతి చెప్పే పాఠాలు – మనిషి మారితేనే వాటికి అర్థం
మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవం ఒక పాఠమే. అయితే వాటిని గమనించే మనసు ఉండాలి. ప్రకృతిలోని చిన్న చిన్న మార్పులు కూడా మన జీవితానికి ఎంతో విలువైన సందేశాలను అందిస్తాయి. వాటిని అర్థం చేసుకుంటే జీవితం పట్ల మన దృక్పథమే మారిపోతుంది.
చెట్టు నుంచి రాలే ఆకు, మనిషి జీవితం ఎంత తాత్కాలికమో గుర్తుచేస్తుంది. అందుకే ఉన్నంతకాలం అర్థవంతంగా జీవించాలనే ఆలోచన కలగాలి. ఒక్కరోజే వికసించే పువ్వు, కాలం తక్కువైనా అందాన్ని పంచవచ్చని చెబుతుంది. మన జీవితంలో కూడా సమయం ఎంత ఉందన్నది కాదు, ఆ సమయంలో మనం ఎంత మంచిని పంచామన్నదే ముఖ్యం.
ఆకాశంలో మెరిసే మెరుపు క్షణకాలమే కనిపించినా తన వెలుగుతో చుట్టూ ఉన్న చీకటిని తొలగిస్తుంది. మనిషి జీవితం కూడా అలాగే, ఎంతకాలం బతికామన్నదికంటే, మన ఉనికి ఎంతమందికి ఉపయోగపడిందన్నదే అసలైన విలువ.
తనను తాను కరిగించుకుంటూ చుట్టూ వెలుగునిచ్చే కొవ్వొత్తి నిస్వార్థ సేవకు ప్రతీక. అలాగే ఎండలో తాను నిలిచి, ఇతరులకు నీడనిచ్చే చెట్టు, మన కష్టాల మధ్య కూడా తోటి వారికి అండగా నిలవాలనే గొప్ప సందేశాన్ని అందిస్తుంది.
ప్రకృతి ప్రతిరోజూ మన కళ్లముందే ఎన్నో జీవిత సత్యాలను చెబుతోంది. వాటిని వినడానికి చెవులు మాత్రమే కాదు, అర్థం చేసుకునే మనసు కావాలి. చివరికి మనిషి వెంట తీసుకెళ్లేది సంపద కాదు, తన వల్ల ఇతరుల జీవితాల్లో మిగిలిన మంచితనం మాత్రమే. అందుకే ఉన్నంతకాలం మన కోసం మాత్రమే కాకుండా.. మన చుట్టూ ఉన్నవారి కోసం కూడా జీవించడం జీవితానికి నిజమైన అర్థాన్ని ఇస్తుంది.
రాలే ఆకు నుంచి వెలిగే కొవ్వొత్తి వరకు.. జీవితానికి ఎన్నో పాఠాలు
