గాల్లో దోమ కనిపిస్తే చాలు.. లేజర్‌తో టార్గెట్!

7878
  • దోమలపై ‘మస్కిటో ఎయిర్ డిఫెన్స్’.. చైనా కొత్త సాంకేతిక ప్రయోగం

దోమలను తరిమికొట్టేందుకు కాయిల్స్, స్ప్రేలు, బ్యాట్లు వాడే రోజులకు భిన్నంగా ఇప్పుడు అత్యాధునిక సాంకేతికత రంగంలోకి దిగుతోంది. చైనాలో అభివృద్ధి చేసిన ఒక కొత్త పోర్టబుల్ పరికరం గాల్లో ఎగురుతున్న దోమలను గుర్తించి లేజర్ కిరణంతో వాటిని నిర్వీర్యం చేసే విధంగా రూపొందించారు. దీనిని ఒక రకమైన ‘మస్కిటో ఎయిర్ డిఫెన్స్’గా ప్రచారం చేస్తున్నారు.

ఈ పరికరంలో సెన్సర్లు, లిడార్, మిల్లీమీటర్ వేవ్ రాడార్, ఏఐ కెమెరా వ్యవస్థ, లేజర్ టెక్నాలజీ కలిసి పనిచేస్తాయి. ముందుగా చుట్టుపక్కల ప్రాంతాన్ని స్కాన్ చేసి, గాల్లో కదులుతున్న చిన్న వస్తువును గుర్తిస్తుంది. అది దోమా లేదా ఇతర చిన్న పురుగేనా అన్నది ఏఐ వ్యవస్థ నిర్ధారిస్తుంది. దోమగా గుర్తించిన తర్వాత లేజర్ వ్యవస్థ దానిపై లక్ష్యం పెట్టి చిన్న పల్స్‌ను ప్రయోగిస్తుంది. రెక్కలు దెబ్బతినడంతో అది ఎగరలేక కిందపడుతుంది.

ఈ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటంటే రసాయనాలు, పురుగుమందులు అవసరం లేకపోవడం. సుమారు 90 డిగ్రీల పరిధిలో చిన్న ఎగిరే పురుగులను స్కాన్ చేయగలదని సంస్థ చెబుతోంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ వ్యవస్థ పనిచేసే సూత్రం సైనిక లేజర్ రక్షణ వ్యవస్థలను పోలి ఉంటుంది. గుర్తించడం, ట్రాక్ చేయడం, లక్ష్యం పెట్టడం, దెబ్బతీయడం అనే నాలుగు దశలు రెండింటిలోనూ ఉంటాయి. అయితే శక్తి స్థాయిలో భారీ తేడా ఉంటుంది. దోమల కోసం తక్కువ శక్తి లేజర్‌ను ఉపయోగిస్తే, సైనిక వ్యవస్థలు డ్రోన్లు, రాకెట్లు వంటి లక్ష్యాల కోసం అత్యంత శక్తివంతమైన లేజర్లను వినియోగిస్తాయి.

చిన్న దోమ నుంచి భారీ డ్రోన్ వరకు లక్ష్యాన్ని గుర్తించి కచ్చితంగా దెబ్బతీయాలనే సూత్రం మాత్రం ఒక్కటే కావడం ఈ కొత్త టెక్నాలజీ ప్రత్యేకత.