నలుపు కారణంగా వదిలేశాడు..

343
  • ముగ్గురు పిల్లల కోసం పోరాటం..
  •  రాజకుమారి కన్నీటి కథ

రియాలిటీ షోలు కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కావు. కొన్నిసార్లు సమాజానికి తెలియని జీవితాలను, మనుషులు ఎదుర్కొన్న కష్టాలను కూడా ప్రపంచం ముందుకు తీసుకువస్తాయి. ప్రస్తుతం బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 కోసం జరుగుతున్న కంటెస్టెంట్ల ఎంపికలో పాల్గొన్న రాజకుమారి తన జీవితంలోని చేదు అనుభవాలను పంచుకుని అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం చెందిన రాజకుమారికి చిన్న వయసులోనే తనకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేశారు. అయితే తాను నల్లగా ఉన్నాననే కారణంతో పెళ్లయిన మూడు నెలలకే భర్త తనను వదిలి మరో యువతిని రహస్యంగా వివాహం చేసుకున్నాడని ఆమె తెలిపింది.

ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆమెకు రెండో పెళ్లి చేశారు. కానీ ఆ బంధం కూడా ఆమె జీవితానికి భరోసా ఇవ్వలేకపోయింది. రెండో భర్త బాధ్యత తీసుకోకపోవడంతో, అతనితో కలిసి చేసిన వ్యాపార ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఈ సమయంలోనే తన జీవితాన్ని మార్చుకోవాలంటే ఎదుటివారిని మార్చడం కాదని, తానే మారాలని రాజకుమారి నిర్ణయించుకుంది. ’మార్చాల్సింది అతన్ని కాదు.. మారాల్సింది నేను’ అనే ఆలోచనతో ముగ్గురు పిల్లల బాధ్యతను తన భుజాలపై వేసుకుంది. ఎన్నో కష్టాలు పడుతూ చివరకు ఒక ఇల్లు కట్టుకుంది. అది పూర్తిగా పూర్తి కాకపోయినా, తన పిల్లలకు ఒక నీడ దొరికిందని ఆమె చెప్పింది. 10వ తరగతి తర్వాత నేర్చుకున్న టైలరింగ్‌నే తన జీవనాధారంగా మార్చుకుంది. కుట్టుమిషన్‌తో పనిచేస్తూనే పిల్లలను చదివించడానికి ప్రయత్నించింది. అదే సమయంలో తనలో ఉన్న నటనా ప్రతిభను కూడా వదిలిపెట్టలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ లక్ష మంది ఫాలోవర్లను సంపాదించుకుంది.

అయితే జీవితం ఆమెకు మరోసారి పరీక్ష పెట్టింది. బైక్ ప్రమాదంలో ఆమె ఎడమ బుగ్గ ఎముక విరిగిపోయింది. ప్రమాదం తర్వాత తన ముఖం పూర్తిగా మారిపోవడంతో తనను తాను అద్దంలో చూసుకోవడానికే భయపడిపోయానని తెలిపింది. అంతకంటే బాధ కలిగించిన విషయం తన పిల్లల స్పందన. గతంలో తన చిన్న కుమారుడు దిండు కూడా లేకుండా తన పొట్టపై పడుకునేవాడని, కానీ ప్రమాదం తర్వాత తన ముఖాన్ని చూసి భయపడి తన దగ్గరకు రావడం మానేశాడని చెప్పింది. దాదాపు నెల రోజుల పాటు పిల్లలు తనను చూసేందుకు కూడా భయపడ్డారని రాజకుమారి కన్నీటి పర్యంతమైంది.

అయితే ఆ సమయంలో కూడా ఆమె ధైర్యం కోల్పోలేదు. ‘నా ప్రాణం పోలేదు కదా.. ఇంకా బతికే ఉన్నాను’ అని తనను తాను ధైర్యపరుచుకుని మళ్లీ జీవితాన్ని ప్రారంభించింది. నెల రోజుల్లోనే కోలుకుని నటనపై దృష్టి పెట్టింది. ‘భయం’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించే అవకాశం రావడంతో పాటు ఆ పాత్రకు బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకుంది.

ఇప్పుడు బిగ్‌బాస్‌లోకి వెళ్లాలనుకోవడం వెనుక కూడా రాజకుమారికి స్పష్టమైన లక్ష్యం ఉంది. కుట్టుమిషన్‌తో పనిచేస్తూ పిల్లలను చదివిస్తున్నప్పటికీ, వారు అనుకున్న స్థాయికి చేరుకోవాలంటే మరింత ఆర్థిక సహాయం అవసరమని ఆమె చెప్పింది. తన నటనా కలను నెరవేర్చుకోవడంతో పాటు, ముగ్గురు పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడమే తన లక్ష్యమని తెలిపింది.. అంతేకాదు, తన జీవితంలో ఎదుర్కొన్న రంగు వివక్ష గురించి కూడా ఆమె మాట్లాడింది. తాను బిగ్‌బాస్‌లోకి వెళ్లగలిగితే తనలాంటి నలుపు రంగు కారణంగా చిన్నచూపు ఎదుర్కొంటున్న వారికి కూడా ధైర్యం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

రాజకుమారి జీవిత కథ విన్న నవదీప్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. శ్రీముఖి, అభిజిత్, బిందు మాధవి ఆమె పోరాట స్ఫూర్తిని ప్రశంసించారు. అయితే కన్నీటి కథతో అందరినీ భావోద్వేగానికి గురి చేసిన రాజకుమారి, తనలోని సరదాను కూడా స్టేజీపై చూపించింది. నవదీప్ పక్కన ఉండాలని అనిపిస్తుందని సరదాగా చెప్పి అందరినీ నవ్వించింది. శ్రీముఖి చెప్పడంతో నవదీప్‌ను ఇంప్రెస్ చేయడానికి తెలుగులో ఒక చిన్న కవిత రాసి చివర్లో ‘ఐ లవ్ యూ సర్’ అంటూ చెప్పింది. అనంతరం నవదీప్‌తో కలిసి ర్యాంప్ వాక్ చేసింది.

చివరగా తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపిన రాజకుమారి, తనదైన శైలిలో సరదా వ్యాఖ్యలు చేస్తూ స్టేజీపై ఉన్న వారిని నవ్వించింది. రెండు వివాహాల్లో ఎదురైన చేదు అనుభవాలు, రంగు కారణంగా ఎదురైన వివక్ష, ముగ్గురు పిల్లల బాధ్యత, ఆర్థిక ఇబ్బందులు, బైక్ ప్రమాదం, ముఖంలో వచ్చిన మార్పు.. ఇన్ని కష్టాలు ఎదురైనా రాజకుమారి వెనక్కి తగ్గలేదు. ప్రతి దెబ్బ తర్వాత మళ్లీ నిలబడి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.