జూన్ 18 తర్వాతే  AP EAPCET ఫలితాలు

APEAPCET

ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన AP EAPCET ఫలితాలను జూన్ 18 తర్వాతే విడుదల చేయనున్నారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ ఒకటిన ఫలితాలు ఇవ్వాల్సి ఉండగా.. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ అవకాశం ఇచ్చినందున సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలపై బుధవారం అధికారులు  సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్మీడియట్ విద్యామండలికి పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్ ఆదేశాలు జారీ చేశారు. ఎప్సెట్లో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉంది. ఈ నేపథ్యంలో ర్యాంకుల్లో మార్పు, విద్యార్థుల్లో గందరగోళం ఉండకూడదనే ఉద్దేశంతో అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చిన తర్వాతే AP EAPCET ఫలితాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాస్తున్నవారు 1.50లక్షల మంది ఉండగా.. అందులో ఒక్క గణితం సబ్జెక్టు వారే లక్ష మంది వరకు ఉన్నారు. జూన్ ఐదో తేదీతో పరీక్షలు ముగుస్తాయి. ఆ తర్వాత మూల్యాంకనానికి 13 రోజుల వరకు సమయం పడుతుంది.