11 కోట్ల ఏళ్ల ‘నాగాటిటాన్’ రహస్యం! 

Dinosaar

పొలంలో కనిపించిన ఎముకలు

థాయ్‌లాండ్‌లోని చయ్యాఫుమ్‌ ప్రావిన్స్‌లో జరిగిన తాజా శిలాజాల ఆవిష్కరణ డైనోసార్‌ పరిశోధనలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. గ్రామీణ ప్రాంతంలో భూమి నుంచి బయటకు కనిపించిన భారీ ఎముకలను స్థానికుడు గమనించడంతో శాస్త్రవేత్తలకు సమాచారం అందింది. అనంతరం అక్కడ తవ్వకాలు చేపట్టిన పాలియోంటాలజిస్టులు ఇప్పటివరకు గుర్తించని కొత్త డైనోసార్‌ జాతి అవశేషాలను వెలికితీశారు. దీనికి ‘నాగాటిటాన్ చయ్యాఫుమెన్సిస్’ అని నామకరణం చేశారు.

సుమారు 11.3 కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన ఈ శాకాహారి డైనోసార్‌ సౌరోపాడ్‌ కుటుంబానికి చెందినది. పొడవాటి మెడ, బలమైన కాళ్లు, భారీ తోకతో ఉండే ఈ జాతి సుమారు 90 అడుగుల పొడవు వరకు పెరిగి ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. థాయ్‌లాండ్‌లో ఇప్పటివరకు గుర్తించిన అతిపెద్ద డైనోసార్లలో ఇది ఒకటిగా నిలిచింది. ఐదు లేదా ఆరు పెద్ద ఏనుగుల బరువుతో సమానమైన శరీర బరువు దీనికి ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు.

తవ్వకాల్లో వెన్నెముక, పక్కటెముకలు, కటి భాగానికి చెందిన అనేక అవశేషాలు లభించాయి. తల, పళ్లు మాత్రం దొరకలేదు. అయితే ఎముకలలోని ప్రత్యేక నిర్మాణం, గాలి ఖాళీలు ఈ భారీ జీవి శరీరాన్ని బలంగా ఉంచుతూనే కొంత తేలికగా మార్చి ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అప్పటి థాయ్‌లాండ్‌ ప్రాంతం వేడి, పొడి వాతావరణంతో ఉండేదని అంచనా. ఫెర్న్‌లు, కోనిఫర్‌ మొక్కలు వంటి వృక్షాలను ఆహారంగా తీసుకుంటూ నాగాటిటాన్ జీవించి ఉండేది. ఈ కొత్త ఆవిష్కరణతో థాయ్‌లాండ్‌లో గుర్తించిన డైనోసార్‌ జాతుల సంఖ్య మరింత పెరిగింది. పురాతన భూమి వాతావరణం, డైనోసార్ల పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడంలో ఈ శిలాజాలు కీలకంగా మారనున్నాయి.