– అంగారకుడిపై ఆహారానికి తొలి అడుగు!
మన నెత్తి మీద నుంచి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో.. భూమికి దూరంగా అంతరిక్షంలో ఓ అద్భుతం జరిగింది. చైనా టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో కొన్ని వరి మొక్కలు పంటను ఇచ్చాయి. చైనా షెన్‌జౌ-23 వ్యోమగాములు అంతరిక్షంలో నిర్వహించిన ప్రయోగంలో తొలిసారిగా పండిన వరిని కోశారు. ఇది కేవలం ఓ పంట కోత కాదు. భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడిపై మనుషులు ఆహారాన్ని తామే పండించుకోగలరా? అనే ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం.
అంతరిక్షంలో మొక్కలు పెరగడం అంత సులభం కాదు
భూమిపై మొక్కలకు గురుత్వాకర్షణ ఎంతో ముఖ్యం. వేర్లు కిందికి పెరుగుతాయి. నీరు నేలలోకి సులభంగా చేరుతుంది. పుప్పొడి కూడా సరైన చోటుకు చేరుతుంది. కానీ అంతరిక్షంలో పరిస్థితి పూర్తిగా భిన్నం. అక్కడ ఉండే మైక్రోగ్రావిటీ వల్ల వేర్లకు ఏది పైకి, ఏది కిందో అర్థం కావడం కష్టం. నీరు నేలలోకి ప్రవహించకుండా చిన్న చిన్న బంతుల్లా తేలుతూ ఉంటుంది. దీంతో మొక్కలకు నీరు అందడం కూడా సమస్యగా మారుతుంది. పుప్పొడి కూడా గాలిలో తేలిపోవడంతో మొక్కలలో పరాగసంపర్కం జరగడం కష్టమవుతుంది. అయినా శాస్త్రవేత్తలు మొక్కలను అంతరిక్షంలో పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆహారం కోసం అంతరిక్షంలోనే వ్యవసాయం
భవిష్యత్తులో మనుషులు అంగారకుడిపైకి వెళ్లాలంటే ఒక పెద్ద సమస్య ఆహారం. భూమి నుంచి ప్రతి కిలో ఆహారాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంగారకుడికి వెళ్లి తిరిగి రావడానికి ఏళ్ల సమయం పట్టవచ్చు. అంతకాలం సరిపడా ఆహారాన్ని వెంట తీసుకెళ్లడం కష్టం. అంతేకాదు, ఎక్కువ కాలం నిల్వ ఉంచిన ఆహారంలో ఉండే కొన్ని విటమిన్లు, పోషకాలు కూడా క్రమంగా తగ్గిపోతాయి. అందుకే అంతరిక్ష నౌకలోనే చిన్న వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనపై శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు.
మొక్కలు ఆహారం మాత్రమే కాదు
అంతరిక్షంలో మొక్కల ఉపయోగం కేవలం ఆహారం అందించడానికే పరిమితం కాదు. మొక్కలు మనుషులు విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ను తీసుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. నీటిని శుద్ధి చేయడంలో కూడా సహాయపడతాయి. అంటే అంతరిక్ష నౌకను ఒక చిన్న జీవ ప్రపంచంగా మార్చడంలో మొక్కలు కీలక పాత్ర పోషించగలవు. అంతేకాదు.. సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణాల్లో వ్యోమగాములకు మొక్కల సంరక్షణ మానసికంగా కూడా ఉపశమనం కలిగిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరిక్షంలో ఓ చిన్న పచ్చని ఆకు కూడా వారికి భూమిని గుర్తు చేస్తుంది.
అంతరిక్షంలో విత్తనాలపై ప్రయోగాలు
చైనా 1987 నుంచే విత్తనాలను అంతరిక్షంలోకి పంపి, వాటిని తిరిగి భూమికి తీసుకువచ్చి పరిశోధనలు చేస్తోంది. అంతరిక్షంలో ఉండే రేడియేషన్ కారణంగా విత్తనాల జన్యువుల్లో సహజంగా మార్పులు జరుగుతాయి. వీటిలో చాలా మార్పులు ఉపయోగపడవు. కానీ కొన్ని మార్పులు మాత్రం ప్రయోజనకరంగా ఉంటాయి.ఉదాహరణకు.. తక్కువ ఎత్తులో పెరిగే మొక్కలు
బలమైన కాండం, ఎక్కువ ప్రోటీన్ ఉన్న పంటలు, వ్యాధులను తట్టుకునే మొక్కలు.. ఇలాంటి లక్షణాలు ఉన్న విత్తనాలను శాస్త్రవేత్తలు గుర్తించి, వాటితో కొత్త రకాల పంటలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ విధంగా చైనాలో ఇప్పటికే వందలాది కొత్త పంట రకాలను అభివృద్ధి చేసినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఇది జన్యుమార్పిడి కాదు. ఇతర జీవుల జన్యువులను మొక్కల్లోకి చేర్చడం ఇందులో జరగదు. సహజంగా జరిగే జన్యు మార్పులను వేగంగా గుర్తించి, ఉపయోగకరమైన వాటిని ఎంపిక చేసుకోవడమే.
మరి అంగారకుడిపై వరి పండుతుందా?
ఇప్పుడే కాదు. అంతరిక్షంలో వరి పండించడం విజయవంతమైనా.. అంగారకుడిపై వ్యవసాయం చేయడం పెద్ద సవాలు. అక్కడి వాతావరణం, నేల, నీరు, ఉష్ణోగ్రత, రేడియేషన్ వంటి అనేక సమస్యలను అధిగమించాల్సి ఉంటుంది. అయితే టియాంగాంగ్‌లో పండిన ఈ వరి ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ రోజు అంతరిక్షంలో ఓ చిన్న వరి మొక్క పండింది. రేపు అదే ప్రయోగం.. అంగారకుడిపై మనిషి తన ఆహారాన్ని తానే పండించుకునే రోజుకు పునాది కావచ్చు.
