-సాంకేతికత పెరిగి.. ఆప్యాయత తగ్గి..
-పెద్దలకు కావాల్సింది వీడియో కాల్ కాదు.. పక్కన కూర్చునే మనిషి
-డిజిటల్ యుగంలో దూరమవుతున్న బంధాల కథ
ఒకప్పుడు ఇంటి గుమ్మం దగ్గర వినిపించే అమ్మా.. అనే పిలుపు ఇంటి పెద్దలకు పండుగలా ఉండేది. ఇప్పుడు అదే పిలుపు మొబైల్ ఫోన్ రింగ్‌టోన్‌గా మారిపోయింది. సాంకేతికత ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చింది. కానీ మనిషిని మనిషికి ఎంత దగ్గర చేసింది? ఎంత దూరం చేసింది? అనే ప్రశ్నకు సమాధానం చెప్పే చిన్న సంఘటన ఇది.
శేఖర్ అనే ఉద్యోగి తన తల్లిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. భార్య శ్యామల కూడా అదే ఆప్యాయతతో అత్తను ఆదరించేది. పుట్టినరోజు సందర్భంగా ఆమెకు స్మార్ట్‌ఫోన్‌ను బహుమతిగా ఇచ్చారు. ఎలా ఉపయోగించాలో నేర్పించారు. బంధువుల ఫోన్ నంబర్లన్నీ సేవ్ చేశారు.
మొదట్లో ఆ తల్లి ఆనందానికి అవధులే లేకపోయాయి. ఉదయం కూతురు ఫోన్.. మధ్యాహ్నం మనవడి వీడియో కాల్.. సాయంత్రం బంధువుల పలకరింపులు. అమ్మా.. ఎలా ఉన్నావు? అనే మాటలు రోజూ వినిపించేవి. అందరూ తనను గుర్తు చేసుకుంటున్నారనే తృప్తి కలిగింది.
కానీ రోజులు గడిచేకొద్దీ ఒక చిన్న మార్పు ఆమె మనసును కలిచివేసింది. ఇంతకుముందు వారానికి ఒకసారి వచ్చిన పిల్లలు ఇప్పుడు నెలలు గడిచినా ఇంటి గడప దాటడం లేదు. ‘ఫోన్‌లో మాట్లాడేశాం కదా’ అన్న ఒక్క మాటతో పరామర్శ ముగిసిపోయింది.
ఒక రోజు కొడుకు.. తల్లి దిగులుగా ఉండటాన్ని గమనించి కారణం అడిగాడు. అప్పుడు ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.
బాబూ..’ఈ ఫోన్ నాకు వద్దు. ఇది వచ్చిన తర్వాత అందరూ నా గొంతు మాత్రమే వింటున్నారు.. నా ముఖం చూడటానికి రావడం లేదు. నాకు కావాల్సింది ఫోన్ కాదు.. నా పక్కన కూర్చునే నా పిల్లలు. ‘అమ్మమ్మా’ అంటూ పరుగెత్తుకొచ్చి కౌగిలించుకునే మనవళ్లు. ఆ ఆనందాన్ని ఏ టెక్నాలజీ ఇవ్వలేదు.’ ఆ మాటల్లో ఒక తల్లి బాధ మాత్రమే కాదు.. నేటి సమాజం కోల్పోతున్న బంధాల వాస్తవం దాగి ఉంది.
స్మార్ట్‌ఫోన్లు మన మధ్య దూరాన్ని తగ్గించాయి. కానీ చాలాసార్లు మనసుల మధ్య దూరాన్ని పెంచేశాయి. ఒకప్పుడు ఇంటికి వెళ్లి పలకరించేవారు. ఇప్పుడు ఒక కాల్‌తో బాధ్యత పూర్తయిందని అనుకుంటున్నారు. సౌకర్యం పెరిగింది.. కానీ సాన్నిహిత్యం తగ్గింది.
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఖరీదైన బహుమతులు, ఖరీదైన ఫోన్లు అవసరం ఉండకపోవచ్చు. వారికి కావాల్సింది రోజులో కొంత సమయం.. నాలుగు ఆప్యాయమైన మాటలు.. పక్కన కూర్చుని నవ్వుతూ మాట్లాడే మనిషి. సాంకేతికతను ఉపయోగించడం తప్పు కాదు. కానీ అది బంధాలకు ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలి. ఫోన్ కాల్ ప్రేమను గుర్తు చేస్తుంది. కానీ ఒక ఆప్యాయమైన పలకరింపు, ఒక కౌగిలి, ఒక గంటసేపు కలిసి గడిపిన సమయం మాత్రమే బంధాలను సజీవంగా ఉంచుతుంది.
ఎందుకంటే.. ఫోన్ మోగితే మాటలు వినిపిస్తాయి. కానీ మనిషి ఇంటికి వస్తే ప్రేమ కనిపిస్తుంది.
