ఉదయం బస్సు లేక.. విద్యార్థులు, ఉద్యోగులకు ఇక్కట్లు!

121

ఉదయం 8.15 గంటలకూ 121M సర్వీస్ నడపాలి

మద్దూరు: మద్దూరు రైల్వే స్టేషన్, మద్దూరు మార్కెట్‌ మీదుగా నడిచే 121ఎం బస్సు సర్వీసు(విజయవాడ గవర్నర్ పేట డిపో) స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉదయం 8 గంటల సమయంలో మద్దూరు నుంచి బయలుదేరే సర్వీసు విద్యార్థులు, ఉద్యోగులకు అనుకూలంగా ఉండటంతో వారు నిత్యం ఈ బస్సుపైనే ఆధారపడేవారు.

ఇటీవల ఉదయం 8 నుంచి 8.30 గంటల మధ్య నడిచే ఈ బస్సు సర్వీసును నిలిపివేయడంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు సమయానికి చేరుకోవడానికి ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో అదనపు ఖర్చుతో పాటు సమయం కూడా వృథా అవుతోందని ప్రయాణికులు వాపోతున్నారు.

ఉదయం వేళ ఈ సర్వీసుకు అధిక డిమాండ్‌ ఉన్నందున గతంలో మాదిరిగానే 8 నుంచి 8.30 గంటల మధ్య 121ఎం బస్సును పునరుద్ధరించాలని మద్దూరు, వణుకూరు, గోసాల ప్రాంత ప్రజలు కోరుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ అధికారులు స్పందించి సర్వీసును తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.