నడకకు తొలి చరిత్ర 

1111

-మనిషి నడకకు తొలి అడుగు..  70 లక్షల ఏళ్ల క్రితమే

మనిషి రెండు కాళ్లపై నడవడం ఎప్పుడు ప్రారంభించాడు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పురాతన శిలాజాలను పరిశీలిస్తున్నారు. ఇప్పుడు దొరికిన ఆధారాలు ప్రకారం మన పూర్వీకులు సుమారు 70 లక్షల ఏళ్ల క్రితమే రెండు కాళ్లతో  నడవడం ప్రారంభించి ఉండవచ్చని సూచిస్తున్నాయి. చింపాంజీని పోలిన ముఖంతో ఉన్న చిన్న జీవి ఆఫ్రికాలోని అడవులు, గడ్డి మైదానాల్లో జీవించేది. దాని శిలాజం చాద్‌లోని డ్జురాబ్ ఎడారిలో 20 ఏళ్లకు పైగా క్రితం బయటపడింది. దీనికి శాస్త్రవేత్తలు సహెలాంత్రోపస్ చాడెన్సిస్   అని పేరు పెట్టారు. ఈ జీవి నిజంగా మనిషిలా రెండు కాళ్లపై నడిచేదా? లేక చెట్లపై నివసించే కోతుల మాదిరిగానే ఉండేదా? అనే విషయంలో శాస్త్రవేత్తల మధ్య చాలాకాలంగా చర్చ కొనసాగింది.

తొడ ఎముకలో కీలక ఆధారం

న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన మానవ పరిణామ శాస్త్రవేత్తలు తాజాగా చేసిన పరిశోధన ఈ ప్రశ్నకు బలమైన సమాధానం ఇచ్చింది. శాస్త్రవేత్తలు పురాతన ఎముకలను ఆధునిక సాంకేతికతతో 3డీ స్కానింగ్ చేసి పరిశీలించారు. తొడ ఎముకలో ఒక చిన్న ఎముక ఉబ్బును గుర్తించారు. దీనిని ఫెమోరల్ ట్యూబర్‌కిల్ అంటారు. రెండు కాళ్లపై నడిచేటప్పుడు శరీరాన్ని స్థిరంగా ఉంచే ముఖ్యమైన లిగమెంట్ ఈ ప్రాంతానికి అనుసంధానమై ఉంటుంది. ఇప్పటివరకు ఇలాంటి నిర్మాణం తర్వాతి కాలానికి చెందిన మానవ పూర్వీకుల్లో మాత్రమే కనిపించింది. అంతేకాదు, సహెలాంత్రోపస్ తొడ ఎముకలో మరో ప్రత్యేక నిర్మాణం కూడా కనిపించింది. ఇది నడిచేటప్పుడు కాళ్లు ముందుకు సరిగ్గా ఉండేందుకు సహాయపడుతుంది.

చెట్లెక్కేది.. నేలపై కూడా నడిచేది

పరిశోధనలో సహెలాంత్రోపస్‌కు బలమైన పిరుదు కండరాలు ఉన్నట్లు  ఆధారాలు లభించాయి. ఇవి రెండు కాళ్లపై నడిచేటప్పుడు శరీరాన్ని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఆధునిక చింపాంజీలతో పోలిస్తే దీనికి చేతులతో పోల్చినప్పుడు కాళ్లు కొంత పొడవుగా ఉన్నాయి. దీని శరీరం నేలపై కదలడానికి కూడా అనుకూలంగా ఉండేదని ఇది సూచిస్తోంది.

అయితే పూర్తిగా చెట్లను వదిలేసిన జీవి మాత్రం కాదు. ఆహారం కోసం, ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి చెట్లను కూడా ఉపయోగించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పరిశోధనకు నాయకత్వం వహించిన న్యూయార్క్ యూనివర్సిటీ మానవ శాస్త్రవేత్త స్కాట్ విలియమ్స్ ప్రకారం, ఇది చింపాంజీ పరిమాణంలోని మెదడు కలిగిన, కానీ రెండు కాళ్లపై నడిచే సామర్థ్యం ఉన్న కోతి లాంటి జీవి.

మన పరిణామంలో కీలక మలుపు

సహెలాంత్రోపస్ సుమారు 70 లక్షల ఏళ్ల క్రితం జీవించింది. అంటే మనిషి, చింపాంజీల పరిణామ మార్గాలు విడిపోయిన కొద్దికాలానికే ఇది జీవించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ పరిశోధన ప్రకారం సహెలాంత్రోపస్‌ను రెండు కాళ్లపై నడిచే లక్షణాలకు స్పష్టమైన ఆధారాలు ఉన్న అత్యంత పురాతన మానవ పూర్వీకుల్లో ఒకటిగా పరిగణించవచ్చు.

రెండు కాళ్లపై నడవడం మనిషి పరిణామంలో అత్యంత ముఖ్యమైన మార్పుల్లో ఒకటి. నేడు మనం సహజంగా చేసే ఈ నడక లక్షల ఏళ్ల పరిణామ ఫలితం. అంటే మనిషి పరిణామ ప్రయాణంలో తొలి అడుగు మనం ఊహించిన దానికంటే చాలా ముందే పడింది. సుమారు 70 లక్షల ఏళ్ల క్రితం ఒక చిన్న జీవి వేసిన ఆ రెండు అడుగులే…   సుదీర్ఘ పరిణామ ప్రయాణానికి ఆరంభం అని చెప్పొచ్చు.