సభలో సంయమనం.. సమాజానికి సందేశం 

Sabha
  • తప్పు జరిగితే.. సరిదిద్దే ధైర్యం ఉండాలి
  • సభా మర్యాదే.. ప్రజాస్వామ్య గౌరవం 

ప్రజాస్వామ్యంలో మాటకు విలువ ఉంది. ఆ మాటను ఎలా ఉపయోగిస్తారన్నదానికి అంతకంటే ఎక్కువ విలువ ఉంది. ముఖ్యంగా చట్ట సభల్లో  పలికే ప్రతి పదం కేవలం అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య సంభాషణ కాదు. అది ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతిబింబం. అందుకే సభలో మాట తప్పినప్పుడు దాన్ని సమర్థించుకోవడం కంటే, తప్పును గుర్తించి సరిదిద్దడం గొప్ప నాయకత్వ లక్షణం.

ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో చోటుచేసుకున్న ఓ చిన్న సంఘటన ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేసింది. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని ప్రస్తావించిన తీరుపై ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. ముఖ్యమంత్రి విజయ్ వెంటనే స్పందించారు. తన మంత్రి ఉపయోగించిన సంబోధన సరైనది కాదని అంగీకరించి, ప్రతిపక్షానికి క్షమాపణ చెప్పారు. తమిళనాడు శాసనసభ చరిత్రలో వాగ్వాదాలు, తీవ్ర రాజకీయ ఘర్షణలు కొత్తేమీ కావు.

ఒక ముఖ్యమంత్రి తన మంత్రిని వెనకేసుకురావడం సహజమైన రాజకీయ ధోరణిగా భావించే రోజుల్లో.. తప్పు జరిగిందని భావించిన వెంటనే దాన్ని సరిదిద్దడానికి ముందుకు రావడం మాత్రం భిన్నమైన సందేశాన్ని ఇస్తుంది. రాజకీయ ప్రత్యర్థిపై గెలవడం కంటే.. సభ గౌరవాన్ని కాపాడటం ముఖ్యమనే భావనకు అది బలం చేకూరుస్తుంది.  సభ అనేది ప్రజల సమస్యలపై చర్చించాల్సిన వేదిక. వ్యక్తిగత దూషణలకు, పరస్పర అవమానాలకు, భౌతిక ఘర్షణలకు అది వేదిక కాకూడదు.

గెలవాల్సింది వాదన.. వ్యక్తి కాదు

ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజం. ప్రభుత్వాన్ని ప్రతిపక్షం ప్రశ్నించాలి. ప్రతిపక్ష విమర్శలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఘాటైన వాదనలు కూడా ఉండొచ్చు. కానీ ఆ వాదన వ్యక్తిగత అవమానంగా మారినప్పుడు ప్రజాస్వామ్య చర్చ తన లక్ష్యాన్ని కోల్పోతుంది. సభలో ఎవరైనా సభ్యుడు అనుచితమైన పదం ఉపయోగిస్తే.. దాన్ని సమర్థించడం నాయకత్వం కాదు. తప్పు జరిగిందని అంగీకరించి, ఆ మాటను వెనక్కి తీసుకుని, సభను తిరిగి చర్చ వైపు తీసుకెళ్లడమే నిజమైన నాయకత్వం.

క్షమాపణ బలహీనత కాదు

రాజకీయాల్లో క్షమాపణ చెప్పడం ఓటమిగా భావించే ధోరణి పెరిగింది. కానీ వాస్తవానికి తప్పును అంగీకరించే నాయకుడే తన స్థాయిని పెంచుకుంటాడు. ‘నేను తప్పు చేశాను’ అని చెప్పడానికి పదవి కాదు.. వ్యక్తిత్వం కావాలి. అదే సంస్కృతి శాసనసభల్లో బలపడితే సభా సమయం ఆదా అవుతుంది. ప్రజా సమస్యలపై చర్చకు ఎక్కువ అవకాశం లభిస్తుంది. రాజకీయ ప్రత్యర్థుల మధ్య విభేదాలు ఉన్నా.. పరస్పర గౌరవం మాత్రం కొనసాగుతుంది.

ప్రజలకు కనిపించేది ఇదే

శాసనసభలో జరిగే ప్రతి పరిణామాన్ని ప్రజలు గమనిస్తారు. నాయకులు ఎలా మాట్లాడుతున్నారు? ప్రత్యర్థి మాటను ఎలా వింటున్నారు? తప్పు జరిగితే ఎలా స్పందిస్తున్నారు? ఇవన్నీ ప్రజలకు రాజకీయ సంస్కృతిపై ఒక అభిప్రాయాన్ని కలిగిస్తాయి. అందుకే సభలో ఒక నాయకుడు చేసిన చిన్న సవరణ కూడా పెద్ద సందేశాన్ని ఇవ్వగలదు. మాట తప్పడం కంటే.. తప్పు మాటను సమర్థించడం ప్రమాదకరం. తప్పును గుర్తించి సరిదిద్దడం మాత్రం ప్రజాస్వామ్యానికి బలం.

శాసనసభల్లో గొంతు ఎత్తడం కంటే.. స్థాయి నిలబెట్టుకోవడం ముఖ్యం. ప్రత్యర్థిని ఓడించడం కంటే.. సభ గౌరవాన్ని కాపాడటం ముఖ్యం. రాజకీయాల్లో విభేదాలు శాశ్వతమే కావచ్చు. కానీ సభా మర్యాద, ప్రజాస్వామ్య విలువలు మాత్రం అందరికీ ఉమ్మడి బాధ్యత. అంతే కానీ సభల్లో గొడవలు పడటం పద్ధతి కాదు.

సభలో మాట తప్పితే.. సరిదిద్దే నాయకత్వం ఉండాలి. ఎందుకంటే నాయకుడి గొప్పతనం అతను ఎప్పుడూ తప్పు చేయకపోవడంలో కాదు.. తప్పు జరిగినప్పుడు దాన్ని ఎంత హుందాగా సరిచేస్తాడన్నదిలో ఉంటుంది.