బిగ్ బాస్ 10: అగ్ని పరీక్షలో అసలు ఆట మొదలైంది.. 

Agni

బిగ్ బాస్ 10: అగ్ని పరీక్షలో అసలు ఆట మొదలైంది..

-ఆ కంటెస్టెంట్‌పై అభిజీత్ ఫైర్!

బిగ్ బాస్ పదో సీజన్ సందడి అప్పుడే మొదలైంది. మరో మూడు, నాలుగు వారాల్లో సీజన్ 10 లాంచ్ కానుండగా.. అంతకంటే ముందే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియలో భాగమైన ‘అగ్ని పరీక్ష’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఆగస్టు 15 నుంచి అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ ప్రసారం కానున్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో వచ్చిన అప్లికేషన్లను వడపోసి దాదాపు 70 మందిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. వీరికి వివిధ టాస్కులు ఇచ్చి వారి టాలెంట్, ఎనర్జీ, బిహేవియర్‌ను జ్యూరీ సభ్యులు పరీక్షించనున్నట్టు సమాచారం. ఈ ప్రక్రియలో చివరకు టాప్ 15 మందిని ఎంపిక చేసి.. వారిలో నుంచి ఐదుగురు లేదా ఆరుగురికి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది.

రైతు బిడ్డ కేటగిరీలో అమ్మాయికి ఛాన్స్?

గత సీజన్‌లో రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్‌కు బిగ్ బాస్ హౌస్‌లో అవకాశం దక్కిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే కేటగిరీలో ఓ అమ్మాయికి అవకాశం ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది. అగ్ని పరీక్షలో ఆమెకు తొలి దశలో గ్రీన్ సిగ్నల్ కూడా లభించినట్టు సమాచారం. ఇక మిగిలిన టాస్కుల్లోనూ మెప్పించి టాప్ 5లోకి చేరుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక రివర్స్ రైటింగ్ అంటూ ప్రత్యేక టాలెంట్‌తో వచ్చిన ఓ అమ్మాయికి కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్టు తెలుస్తోంది. ఫుల్ ఎనర్జీతో ఉన్న పలువురు కంటెస్టెంట్లను తదుపరి దశకు పంపించినట్టు ప్రోమోను చూస్తే అర్థమవుతోంది.

జ్యూరీగా అభిజీత్, బిందు మాధవి, నవదీప్

తాజాగా విడుదలైన అగ్ని పరీక్ష ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జ్యూరీ సభ్యులుగా అభిజీత్, బిందు మాధవి, నవదీప్ తమదైన స్టైల్‌లో కంటెస్టెంట్లను పరీక్షించినట్టు కనిపిస్తోంది. సరదాగా మాట్లాడుతూ.. అవసరమైన చోట కంటెస్టెంట్లకు గట్టి కౌంటర్లు కూడా ఇచ్చారు. శ్రీముఖి కూడా తనదైన స్టైల్‌లో ఎంటర్టైన్ చేస్తూ కనిపించింది. ముఖ్యంగా కండలు తిరిగిన కంటెస్టెంట్లను చూడగానే ఆమె ‘వావ్’ అంటూ రియాక్ట్ కావడం ఆకట్టుకుంది. దీంతో నవదీప్ కూడా ‘నీకు కావాల్సింది వచ్చిందా?’ అంటూ శ్రీముఖికి కౌంటర్ వేయడం ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది.

అభిజీత్‌నే టార్గెట్ చేసిన కంటెస్టెంట్

ఈ ప్రోమోలో ఓ కంటెస్టెంట్ ఏకంగా అభిజీత్‌పైనే కౌంటర్ వేయడం ఆసక్తిని రేపింది. ‘బిగ్ బాస్ షో అయ్యాక రెండు, మూడు సంవత్సరాలు అభిజీత్ కనిపించలేదు కదా’ అంటూ అతను కామెంట్ చేశాడు. దీంతో అభిజీత్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యాడు. ‘మాకు వేరే పని లేదని అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావ్ అసలు?’ అంటూ ఆ కంటెస్టెంట్‌కు రెడ్ సిగ్నల్ చూపించాడు. మరోవైపు ఓ కంటెస్టెంట్ రూల్స్ అతిక్రమించినట్టు కనిపించడంతో శ్రీముఖి కూడా గట్టిగానే ఫైర్ అయింది. ‘మమ్మల్నే మోసం చేస్తావా? జ్యూరీని తప్పుదారి పట్టిస్తావా?’ అంటూ ఆమె ప్రశ్నించడం ప్రోమోలో ఆసక్తికరంగా మారింది.

వైరల్ అవుతున్న కంటెస్టెంట్ల లిస్ట్

ఇప్పటికే బిగ్ బాస్ 10లోకి వెళ్లే అవకాశం ఉన్న సెలబ్రిటీల పేర్లతో ఓ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీపిక రంగరాజు, ఆటో రామ్ ప్రసాద్, జబర్దస్త్ రాకేష్, హరి, పల్లవి రామిశెట్టి, పల్లవి గౌడ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ పేర్లపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. మొత్తానికి అగ్ని పరీక్ష ప్రోమో చూస్తుంటే.. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్ల ఎంపిక కూడా రసవత్తరంగానే ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అసలు టాప్ 15లో ఎవరుంటారు? ఫైనల్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే ఆ ఐదారు మంది ఎవరు? అనేది తెలియాలంటే అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ ప్రసారం అయ్యే వరకు వేచి చూడాల్సిందే.