జీవితంలో గ్లామర్‌ కాదు.. గ్రామర్‌ ముఖ్యం!

Life (1)

ఆదాయం ఎంత ఉందో తెలుసుకోకుండా ఖర్చులు పెంచుకోవడం, అవసరానికి మించి అప్పులు చేయడం, ఇతరులను చూసి జీవనశైలిని మార్చుకోవడం.. ఇవన్నీ ఆర్థిక ఇబ్బందులకు దారితీసే ప్రధాన కారణాలు. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని సరైన పద్ధతిలో నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. జీవితంలో కొన్ని ప్రాథమిక సూత్రాలను విస్మరిస్తే.. సంపాదన ఉన్నా ప్రశాంతమైన జీవితం దూరమవుతుంది.

ముందుగా ఆదాయానికి తగ్గట్టే ఖర్చులు ఉండాలి. ఇతరులను అనుకరించాల్సిన అవసరం లేదు. విలాసాల కోసం ఆదాయాన్ని మించి ఖర్చు చేస్తే చివరకు అప్పులే మిగులుతాయి. జీవన ప్రమాణం పెంచుకోవాలంటే ఖర్చులు పెంచడం కంటే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలి.

అప్పు అనేది పూర్తిగా తప్పు కాదు. ఆస్తి కొనుగోలు, ఇల్లు నిర్మాణం, వ్యాపార అభివృద్ధి వంటి ఉత్పాదక అవసరాలకు నియంత్రితంగా తీసుకునే బ్యాంకు రుణం ఉపయోగపడుతుంది. అధిక వడ్డీకి వ్యక్తిగత అప్పుల జోలికి వెళ్లడం ప్రమాదకరం.  నెలకు రెండు, మూడు రూపాయల వడ్డీ అంటూ తీసుకునే రుణాలు కాలం గడిచేకొద్దీ భారంగా మారుతాయి. అధిక వడ్డీ అప్పు కుటుంబ ఆర్థిక స్థిరత్వాన్నే దెబ్బతీస్తుంది.

అప్పు ఇవ్వడంలోనూ జాగ్రత్త అవసరం. మొహమాటంతో ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోతే డబ్బుతో పాటు సంబంధాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. సాయం చేయాలనుకుంటే మన సామర్థ్యానికి తగ్గట్టుగా తిరిగి ఆశించకుండా చేయడం మంచిది. ఇవ్వలేని పరిస్థితిలో స్పష్టంగా చెప్పడం.. తరువాత వచ్చే సమస్యల కంటే మేలు.

మరో ముఖ్యమైన విషయం పొదుపు. సంపాదనలో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం క్రమం తప్పకుండా దాచుకోవాలి. క్రెడిట్‌ కార్డులు, ఈఎంఐలు, ‘ఇప్పుడే కొనండి.. తర్వాత చెల్లించండి’ వంటి ఆకర్షణలు అవసరాన్ని కోరికగా, కోరికను అప్పుగా మార్చే ప్రమాదం ఉంది. షాపింగ్‌కు వెళ్లేటప్పుడు అవసరమైన వస్తువుల జాబితా సిద్ధం చేసుకోవాలి. అవసరంతో కొనేది ఒకటి.. ప్రదర్శన చూసి ఆకర్షణతో కొనేది మరొకటి. రెండింటి మధ్య తేడాను గుర్తించగలిగితే అనవసర ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.

ఆరోగ్య విషయంలోనూ సమతుల్యత అవసరం. ఇంటి ఆహారం, శారీరక శ్రమ, వ్యాయామం, తగిన నిద్ర, కుటుంబంతో గడిపే సమయం ఆరోగ్యానికి పునాది. అనారోగ్య లక్షణాలు ఉంటే నమ్మకమైన వైద్యుడిని సంప్రదించాలి. ప్రతి చిన్న సమస్యకూ అనవసర పరీక్షలు చేయించుకోవడం కంటే అవసరమైన వైద్యం తీసుకోవడం, అవసరమైతే రెండో అభిప్రాయం పొందడం మంచిది. ఆరోగ్య బీమా ఉండటం రక్షణే కానీ.. అవసరం లేని వైద్య ఖర్చులకు అది కారణం కాకూడదు.

మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో ఒక విషయం మాత్రం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. సంపాదన శాశ్వతం కాదు.. ఖర్చులూ ఎప్పటికీ ఒకేలా ఉండవు. అందుకే ఈరోజు వచ్చిన ఆదాయాన్ని మొత్తం ఈరోజే ఖర్చు చేయకుండా రేపటి అవసరాల కోసం కొంత దాచుకోవాలి.

చివరికి జీవితం అనేది ఇతరులకు చూపించడానికి కాదు.. మనకు మనం ప్రశాంతంగా జీవించడానికి. మెరుపులు, మాల్స్‌, ఆఫర్లు, విలాసాల కంటే ఆర్థిక క్రమశిక్షణ, ఆరోగ్యం, కుటుంబం, పొదుపు, భవిష్యత్‌ భద్రతే అసలైన సంపద. జీవితంలో గ్లామర్‌ కంటే.. జీవిత గ్రామర్‌ నేర్చుకోవడమే గొప్ప విజయం.