పొదుపు మంచిదే… కానీ జీవితాన్ని వాయిదా వేయొద్దు
భవిష్యత్తు కోసం హడావుడి పడుతూ … వర్తమానాన్ని కోల్పోతున్నామా?
మనిషి జీవితమంటే కేవలం బతకడం కాదు… జీవించడం కూడా. ప్రస్తుత సమాజంలో చాలామంది జీవితం అంటే బాధ్యతలు, సంపాదన, పొదుపు, భవిష్యత్తు భద్రత అనే నిర్వచనాల మధ్య చిక్కుకుపోతున్నారు.
చిన్నప్పుడు పెద్ద పెద్ద కలలు కంటాం. యవ్వనంలో వాటి కోసం రేయింబవళ్లు కష్టపడతాం. ఉద్యోగం, కుటుంబం, పిల్లల భవిష్యత్తు కోసం జీవితాన్ని పణంగా పెడతాం. కానీ ఒక దశకు వచ్చాక ‘ఇప్పుడు కాస్త ప్రశాంతంగా జీవిద్దాం’ అనే ఆలోచన రావాల్సిన సమయంలో కూడా అదే పరుగు కొనసాగుతుంది.
‘ఇంకొంచెం డబ్బు దాచుకుందాం.., ముందు ముందు అవసరం పడొచ్చు.., పిల్లలకు ఇంకా ఎక్కువ ఇవ్వాలి.., ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం…’ ఈ ఆలోచనలు బాధ్యతాయుతమైనవే. అవే మన జీవితాన్ని నియంత్రించడం ప్రారంభించినప్పుడు సమస్య మొదలవుతుంది.
నేటి తరం పెద్దలు కొరతను చూశారు. కష్టాన్ని అనుభవించారు. ప్రతి రూపాయి వెనుక ఉన్న విలువ తెలుసుకున్నారు. అందుకే పొదుపు వారి జీవితంలో ఒక ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు… ఒక భద్రతా భావంగా మారింది.
పొదుపు అనేది జీవితాన్ని ఆస్వాదించకుండా ఉండటానికి కారణం కాకూడదు. ఎందుకంటే, జీవితంలో కొన్ని విషయాలు డబ్బుతో తిరిగి కొనలేం. అరవై ఏళ్ల వయసులో యాభై ఏళ్ల ఆరోగ్యాన్ని కొనలేం. డెబ్బై ఏళ్ల వయసులో నలభై ఏళ్ల ఉత్సాహాన్ని తీసుకురాలేం. కోట్ల రూపాయలు ఉన్నా, మన పిల్లల చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ అనుభవించలేం. నిజానికి పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి కోరుకునేది భారీ ఆస్తులు కాదు. వారికి కావాల్సింది ప్రేమ, సమయం, ఆప్యాయత, ఆరోగ్యంగా ఉన్న అమ్మానాన్నలు.
ఇవి అసలైన సంపద
కుటుంబంతో కలిసి చేసిన ఒక చిన్న ప్రయాణం, అందరూ కలిసి నవ్వుకుంటూ తిన్న ఒక సాధారణ భోజనం, పిల్లలతో కలిసి చూసిన ఒక సూర్యాస్తమయం.. ఇవే జీవితాంతం మిగిలిపోయే అసలైన సంపద.
డబ్బు లక్ష్యం కేవలం బ్యాంక్ ఖాతాలో పెరుగుతూ ఉండటం కాదు. మంచి వైద్యం పొందడానికి, మంచి ఆహారం తినడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, కలలను నెరవేర్చుకోవడానికి, జీవితాన్ని అందంగా మార్చుకోవడానికి అది ఉపయోగపడాలి.
రిటైర్మెంట్ అంటే జీవితం ముగిసిందని కాదు. జీవితాన్ని కొత్తగా ప్రారంభించే అవకాశం. ఇప్పటివరకు మనం డబ్బు కోసం పనిచేశాం. ఇక నుంచి డబ్బు మన కోసం పనిచేయాలి. మన ఆరోగ్యాన్ని కాపాడాలి. మన ఆనందాన్ని పెంచాలి. మన కలలను నెరవేర్చాలి. మనకు ఇష్టమైన పనులు చేసుకునే స్వేచ్ఛను ఇవ్వాలి.
- చివరికి జీవితంలో మిగిలేది మనం సంపాదించిన ఆస్తి కాదు.. మనం సృష్టించిన అనుభవాలు.
- మన బ్యాంక్ బ్యాలెన్స్ కాదు.. మన కుటుంబం ముఖాల్లో కనిపించే చిరునవ్వులు.
- మన స్థిరాస్తులు కాదు.. మన కోసం ఎదురుచూసే మనుషులు.
పొదుపు గొప్ప గుణమే. కానీ అవసరమైనప్పుడు ఖర్చు చేయడం కూడా ఒక జీవన నైపుణ్యం. జీవితం చివర్లో చాలామంది ‘ఇంకొంచెం ఎక్కువగా జీవించి ఉండాల్సింది’ అని బాధపడతారు. ‘ఇంకాస్త ఎక్కువగా ప్రేమించి ఉండాల్సింది , ఇంకాస్త ఎక్కువగా నవ్వి ఉండాల్సింది, ఇంకాస్త ఎక్కువగా కుటుంబంతో గడిపి ఉండాల్సింది’ అని అనుకుంటారు.
అందుకే భవిష్యత్తు కోసం ప్రణాళిక వేయండి. పొదుపు చేయండి. బాధ్యతలను నిర్వర్తించండి.
కానీ ఈరోజును జీవించడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే జీవితం అనేది ఒక రోజు మనం ప్రారంభించబోయేది కాదు. ఈ క్షణంలో, ఈ రోజున, మన ప్రియమైన వారితో కలిసి మనం అనుభవిస్తున్న ప్రతి అనుభూతే నిజమైన జీవితం.
‘జీవితాన్ని వాయిదా వేయొద్దు… ఎందుకంటే క్యాలెండర్‌లో మారేది తేదీలు మాత్రమే, తిరిగి రానిది మన సమయం.’
