జూన్ 30న ముఖ్యమంత్రి కార్యాలయానికి రాయబారం
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు రైతాంగానికి బకాయి పడ్డ సుమారు రూ. 20 వేల కోట్ల రూపాయలు తక్షణమే రైతుల ఖాతాలో జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూన్ 6 శనివారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో విజయవాడ, దాసరి భవన్ లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 6 సీజన్లలో ప్రకృతి వైపరీత్యాలతో పంటల దెబ్బతిని నష్టపోయిన రైతులకు బీమా పరిహారం కింద చెల్లించాల్సినటువంటి పరిహారం సుమారు రూ.4వేల కోట్లు తక్షణమే చెల్లించాలని, రాబోయే ఖరీఫ్ సీజన్ కి ఉచిత పంటల బీమా పథకం కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలను సకాలంలో చెల్లించక రాష్ట్రాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు బ్లాక్ లిస్టులో పెట్టాయని దీనికి కారణం కూటమి ప్రభుత్వమేనని జి.ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు18 సార్లు ప్రకృతి విపత్తులు సంభవించాయని వీటి వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో చెల్లించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కింద సుమారు రూ.1000 కోట్లు బకాయిలు ఉన్నయన్నారు.
ఈ మొత్తాన్ని వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని కోరారు. లక్ష రూపాయలు లోపు పంట రుణం తీసుకుని సకాలంలో చెల్లించిన రైతాంగానికి వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారనీ, కానీ ఈ రెండు సంవత్సరాల కాలంలో రూ.500 కోట్లు వడ్డీ రాయితీ బకాయిలు ఉన్నాయని వీటిని రైతుల ఖాతాలో తక్షణమే జమ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ,తమిళనాడు ప్రభుత్వాల మాదిరిగా రెండు లక్షల రూపాయల లోపు వ్యవసాయ రుణాలన్నిటిని మాఫీ చేసి ఆత్మహత్యల నుంచి రైతాంగాన్ని కాపాడాలని కోరారు. ఇవే కాకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి ఏడాది చెల్లించాల్సిన రూ.10716 కోట్లు వెంటనే విడుదల చేసి రైతుల ఖాతాలో జమ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఏలూరు జిల్లాలో పండిన పొగాకు కిలోకు రూ. 450, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాలో పండించిన పొగాకు కిలోకి రూ.360 చొప్పున పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేయాలని కోరారు. చిత్తూరు జిల్లా, రాయలసీమ జిల్లాల్లో పండించిన తోతాపూరి మామిడికి టన్నుకు రూ. 18వేలు, బంగినపల్లి టన్ను రూ.25వేల చొప్పున మద్దతు ధరలు ప్రకటించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
రైతులు,కౌలురైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జూన్ 30న ముఖ్యమంత్రి కార్యాలయానికి రాయబారం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులు, కౌలురైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన రైతాంగానికి పిలుపునిచ్చారు.
కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయక పోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో భూమిలేని కౌలురైతులు సుమారు 8 లక్షల మంది ఉన్నారని, వీరందరికీ ఎన్నికల వాగ్దానం మేరకు అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి కౌలురైతుకు రెండేళ్ల బకాయిలను ఒకేసారి రూ.40 వేల చొప్పున రూ. 3200 కోట్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
పెరుగుతున్న సాగు ఖర్చులను దృష్టిలో పెట్టుకుని “స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ “పెంచి రైతాంగానికి పంట రుణాలు అందించాలని కోరారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ప్రతి కౌలు రైతుకు పంట హమీపై రూ.2లక్షల వరకు షూరిటీ లేని పంట రుణాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టుల కాలవల నిర్మాణం తక్షణమే చేపట్టాలని, పంట కాలవల్లో ఉన్న పూడిక ,గుర్రుపు డెక్క, తూడికాడను తొలగించాలని, ఎత్తిపోతల పథకాలకు మరమ్మత్తులు తక్షణమే చేపట్టాలని చెరువుల ఆక్రమణలను తొలగించి కట్టలను బలోపేతం చేసి సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్నీడి యల్లమందారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ హామీ మేరకు మద్దతు ధరలకంటే తక్కువుకు అమ్ముకొని నష్టపోయిన మొక్కజొన్న రైతులకు ఎకరానికి రూ.21 వేలు ధరల వ్యత్యాసం పథకం కింద చెల్లించాలని డిమాండ్ చేశారు. పెరిగిన రొయ్యల ఫీడ్, సీడ్, మెడిసిన్ ధరలు తగ్గించాలని, రొయ్యలకు మద్దతు ధరల ప్రకటించాలని జోన్, నాన్ జోన్ తో సంబంధం లేకుండా ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తును రూ.1.50 అందించాలని కోరారు. అకాల వర్షాలు ,ఈదురు గాలులు, వడగండ్ల వానల వల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీని అందించాలని కోరారు.
