ఐఏఎస్ గంధం చంద్రుడు స్ఫూర్తి ప్రయాణం
కొన్ని విజయగాథలు పుస్తకాలలో చదివితే ప్రేరణ ఇస్తాయి. కొన్ని కథలు వింటే కళ్లలో నీళ్లు తెప్పిస్తాయి. మరికొన్ని జీవితాలు మాత్రం సమాజానికి అద్దం పడతాయి. అలాంటి జీవితమే ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడు కథ. నేడు ఆయన ఉన్నతాధికారిగా వేలాది మంది జీవితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. కానీ ఒకప్పుడు ఆయన కూడా ఒక సాధారణ పల్లెటూరి బాలుడే. చదువుతో జీవితాన్ని మార్చుకోవాలని కలలు కన్న పేద కుటుంబానికి చెందిన చిన్నారి.
వెళ్ళిరా బిడ్డా ..
అది 1992. కర్నూలు జిల్లా కోటపాడు గ్రామం . ఐదో తరగతి పూర్తి చేసిన చంద్రుడు నవోదయ పాఠశాల ప్రవేశ పరీక్షలో సీటు సాధించాడు. పేదరికం మధ్య.. చదువే జీవితాన్ని మార్చగలదని నమ్మిన కుటుంబం వారిది. అయితే ఆ కలను నిజం చేసుకోవాలంటే ఒక కుల ధ్రువీకరణ పత్రం అవసరం. తండ్రి కూలీ. తల్లి రోజువారీ శ్రమజీవి. ఇద్దరూ పనికి వెళ్లాల్సిన పరిస్థితి. చేతిలో పది రూపాయల నోటు పెట్టి ‘జాగ్రత్తగా వెళ్లి సర్టిఫికెట్ తెచ్చుకోరా బిడ్డా’ అని పంపించిన తండ్రి మాటలతో పదకొండేళ్ల చంద్రుడు వంటరిగా మండల కార్యాలయానికి బయలుదేరాడు.
గుమ్మం వైపు ఆశగా..
ఆ రోజు ఎండ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఆఫీసు ఎదుట ఉన్న చిన్న చెట్టు కూడా సరైన నీడ ఇవ్వలేని స్థితి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసు గుమ్మం వైపు ఆశగా చూస్తూనే ఉన్నాడు. సమయం కరుగుతోంది. ఆకలి పెరుగుతోంది. కాళ్లు కాలిపోతున్నాయి. అయినా అక్కడి నుంచి కదల్లేదు. ఎందుకంటే ఆ సర్టిఫికెట్ లేకపోతే తన భవిష్యత్తే చీకటిలో కలిసిపోతుందని తెలుసు.
ఐదు రూపాయలు లాక్కున్న బంట్రోతు
సాయంత్రం అయ్యేసరికి సర్టిఫికెట్ సిద్ధమైంది. అక్కడ ఇంకో వ్యవస్థ పనిచేస్తోంది. అధికారిక వ్యవస్థ కాదు… అవినీతి వ్యవస్థ. ‘ఏమైనా తెచ్చావా?’ అని అడిగిన బంట్రోతు మాటలు నాడు చిన్నారి చంద్రుడు కి అర్థం కాలేదు. చివరకు అతని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని జేబులో ఉన్న ఐదు రూపాయల నోటు, చిల్లర మొత్తాన్ని బలవంతంగా లాక్కున్నాడు. అది కేవలం ఐదు రూపాయలు కాదు.. ఒక కూలీ తండ్రి రోజు మొత్తం చిందించిన చెమట. ఒక పేద కుటుంబం కూడబెట్టిన ఆశ. ఒక చిన్నారి భవిష్యత్తుకు వేసిన పునాది. సర్టిఫికెట్ చేతికి వచ్చింది. కానీ ఇంటికి వెళ్లే బస్సు ఛార్జీ కూడా మిగల్లేదు.
ఆరు కిలోమీటర్లు నడకే
ఆకలి కడుపును దహిస్తుంటే.. కాళ్లు నొప్పితో వణుకుతున్నాయి. చీకట్లు కమ్ముకుంటున్నాయి. అయినా చంద్రుడు ఆగలేదు. ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మేనత్త ఇంటి వరకు నడిచాడు. కొంత దూరం పరుగెత్తాడు. కొంత దూరం కన్నీళ్లతో సాగాడు. గుండెల్లో భయం… చేతిలో సర్టిఫికెట్… కడుపులో ఆకలి. అయినా తప్పదు జీవన ప్రయాణం.
తల్లిదండ్రుల ఎదురుచూపు
రాత్రి అయ్యింది. కొడుకు ఇంటికి రాలేదు. బస్టాండ్ వద్ద తండ్రి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. గుమ్మం వద్ద తల్లి కన్నీళ్ల తో ఎదురు చూస్తోంది. ఆ రోజుల్లో ఫోన్లు లేవు. సమాచారం తెలుసుకునే అవకాశం లేదు. ఎక్కడున్నాడో తెలియని కొడుకు కోసం ఆ తల్లిదండ్రులు రాత్రంతా కంటిమీద కునుకు లేక గడిపారు. మరుసటి రోజు చంద్రుడు క్షేమంగా ఇంటికి చేరుకున్నప్పుడు వారి గుండెల్లో పేరుకున్న భయం కరిగిపోయింది. కానీ ఆ రోజు అతని మనసులో పడిన గాయం మాత్రం ఎప్పటికీ చెరిగిపోలేదు.
బలహీనుడు కాదు.. బలవంతుడిని చేసింది
అయితే ఆ గాయం అతన్ని బలహీనుడిని చేయలేదు. బలవంతుడిని చేసింది. అవమానాన్ని ఆత్మవిశ్వాసంగా మార్చుకున్నాడు. ఆకలిని ఆకాంక్షగా మలచుకున్నాడు. కన్నీళ్లను కసిగా మార్చుకున్నాడు.
విద్యా ప్రయాణం ఇలా ..
గంధం ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను జవహర్ నవోదయ విద్యాలయంలో పూర్తి చేశారు. అనంతరం ఇగ్నో నుంచి బి.ఏ. (BA) పట్టా పుచ్చుకున్నారు. అదే విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో ఎం.ఏ. డిగ్రీని కూడా పూర్తి చేశారు. ఉన్నత విద్యపై ఉన్న ఆసక్తితో ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ ని పూర్తి చేశారు.
పరిష్కారం చూపే కలెక్టర్ గా
ఒకప్పుడు సర్టిఫికెట్ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగిన బాలుడు… నేడు వేలాది మంది విద్యార్థులు, పేదలు, సామాన్య ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే కలెక్టర్‌గా ఎదిగాడు. జీవితంలో గొప్ప విజయం అంటే అధికారంలోకి రావడం కాదు. తాను అనుభవించిన బాధ మరొకరికి రాకుండా చూడడం. గంధం చంద్రుడు కథ అదే చెబుతోంది.ఒక బంట్రోతు అతని జేబులోని ఐదు రూపాయలు లాక్కున్నాడు. కానీ అతని కలలను దోచుకోలేకపోయాడు. ఎందుకంటే ఆ ఐదు రూపాయల వెనుక ఒక తండ్రి ఆశ ఉంది. ఒక తల్లి ప్రార్థన ఉంది. ఒక బాలుడి పట్టుదల ఉంది. ఆ కన్నీటి చుక్కలే ప్రజల కోసం పనిచేసే ఓ ఉన్నతాధికారిగా రూపాంతరం చెందాయి. కటిక పేదరికం, ఎన్నో సామాజిక, ఆర్థిక కష్టాలను అధిగమించి రైల్వే టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి ఐఏఎస్ అధికారిగా ఆయన సాధించిన విజయం ఎంతో మంది సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్లకు ఒక గొప్ప స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
- పేదరికం అతని అడుగులను అడ్డుకుంది.. అవినీతి అతని మనసును గాయపరిచింది.. కానీ విద్య అతని విధిని తిరగరాసి, అదే వ్యవస్థకు అధిపతిగా నిలబెట్టింది.
