-డాక్టర్ సమరం
విజయవాడ: ఆదర్శ ఆరోగ్య రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్గా నిలవాలనిఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పూర్వ అధ్యక్షులు డాక్టర్ సమరం అన్నారు. ఆరోగ్యవంతమైన ప్రజలే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తారని, ప్రతి పౌరుడికి నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించే సమగ్ర వ్యవస్థను ప్రభుత్వం మరింత బలోపేతం చేయాలన్నారు.
జూలై 1 వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని వాసవ్య నర్సింగ్ హోంలో డి. రవికుమార్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ సమరం మాట్లాడుతూ ఆరోగ్య సేవలు అంటే కేవలం వ్యాధులకు చికిత్స చేయడం మాత్రమే కాదని, వ్యాధులను ముందుగానే నివారించడం, ప్రారంభ దశలో గుర్తించడం, అవసరమైన చికిత్సతో పాటు పునరావాస సేవలు అందించడం కూడా ప్రభుత్వ బాధ్యతేనని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, గిరిజన ప్రాంతం, పట్టణం, ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ మురికివాడల్లోనూ స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణ, దోమల నివారణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి పాఠశాలలో సంవత్సరానికి కనీసం ఒకసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి కంటి, దంత, వినికిడి పరీక్షలతో పాటు పోషకాహారం, మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.
ప్రస్తుతం యువతలో మత్తు పదార్థాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతోందని పేర్కొన్న ఆయన, పాఠశాలలు, కళాశాలలు, తల్లిదండ్రులు, పోలీసులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో మత్తు పదార్థాల నివారణపై నిరంతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమిష్టిగా పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శవంతమైన ఆరోగ్య రాష్ట్రంగా నిలుస్తుందని, ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’ లక్ష్యం సాకారమవుతుందని డాక్టర్ సమరం పేర్కొన్నారు. అనంతరం సదస్సుకు హాజరైన పలువురు అడిగిన ఆరోగ్య సంబంధిత సందేహాలకు డాక్టర్ సమరం సమాధానాలు ఇచ్చి అవగాహన కల్పించారు.
