‘సున్నా దేవాలయం’ గురించి తెలుసా? 

Zero

– ప్రపంచాన్ని మార్చిన సంఖ్యకు నిలయమైన గ్వాలియర్ చతుర్భుజ ఆలయం

 మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ కోటలో దాగి ఉన్న ఒక చిన్న దేవాలయం ప్రపంచ చరిత్రలో గొప్ప స్థానం సంపాదించుకుంది. అదే చతుర్భుజ ఆలయం. దీనిని చాలామంది ‘జీరో టెంపుల్’  అని పిలుస్తారు. కారణం, ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన ‘౦’ (సున్నా) అంకె చెక్కబడిన శిలాశాసనాల్లో ఒకటి ఇక్కడే లభించడం. బయటకు సాధారణ ఆలయంలా కనిపించినా, గణితశాస్త్ర చరిత్రలో ఈ దేవాలయం చేసిన సేవ అమూల్యమైనది. చరిత్ర, గణితం, విజ్ఞానం, పురావస్తు శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక అరుదైన చూడదగ్గ  ప్రదేశం.

9వ శతాబ్దానికి చెందిన ఆలయం

చతుర్భుజ ఆలయం క్రీ.శ. 875–876 ప్రాంతంలో నిర్మించబడినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. గుర్జర-ప్రతీహార  రాజవంశ పాలనలో నిర్మితమైన ఈ రాతి ఆలయం చతుర్భుజ విష్ణుమూర్తికి అంకితం చేసారు. ఆలయంలోని ఒక గోడపై చెక్కిన సంస్కృత శాసనమే దీనికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చింది.

‘సున్నా’కు శాశ్వత సాక్ష్యం

ఈ శిలాశాసనంలో భూమి విరాళాలు, కొలతలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. అందులో 270, 50 వంటి సంఖ్యలను రాయడానికి నేటి ‘0’ ను పోలిన గుండ్రటి గుర్తును ఉపయోగించారు. ఈ శాసనం ‘దశాంశ స్థాన విలువ’ లో ఉపయోగించిన చెక్కిన సున్నా గుర్తుకు ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన ఆధారాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. బక్షాలి మాన్యుస్క్రిప్ట్ వంటి మరింత పాత గణిత గ్రంథాలపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నప్పటికీ, రాతిపై చెక్కబడిన ‘0’కు సంబంధించిన అత్యంత  పురాతన ఆధారాల్లో గ్వాలియర్ శాసనం విశేష ప్రాధాన్యం కలిగి ఉంది. నేడు ‘0’ సాధారణ సంఖ్యగా కనిపించినా, అది లేకపోతే ఆధునిక ప్రపంచాన్ని ఊహించడం అసాధ్యం.

సున్నా ఆధారంగానే అభివృద్ధి చెందిన రంగాలు చాలా ఉన్నాయి . వాటిలో … ఆధునిక గణితశాస్త్రం కంప్యూటర్లు.. బ్యాంకింగ్ వ్యవస్థ.. ఆర్ధిక  రంగం.. ఇంజినీరింగ్.. ఖగోళ శాస్త్రం అంతరిక్ష పరిశోధనలు ఇలా ఎన్నో ఉన్నాయి. 

భారతీయులు అభివృద్ధి చేసిన దశాంశ సంఖ్యా విధానం ప్రపంచ గణితాన్ని  మార్చేసింది . గ్వాలియర్ శాసనం ఆ ఆవిష్కరణకు 1,100 సంవత్సరాల కంటే పూర్వమే ప్రజలు రోజూ వారి  జీవితంలో సున్నాను ఉపయోగించినట్లు నిరూపిస్తోంది.

ఆలయ ప్రత్యేకత

ఆలయంలో చిన్న గర్భగుడి, స్తంభాలతో కూడిన సాధారణ ప్రవేశ ద్వారం ఉన్నాయి. గోడలపై చెక్కిన సంస్కృత శాసనాల్లో ఆలయ తోటలు, భూముల కొలతలు, విరాళాల వివరాలు నమోదయ్యాయి. ఈ శాసనాల మధ్యే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ‘0’ కనిపిస్తుంది. కానీ  శతాబ్దాల పాటు ఈ  ఆలయానికి పెద్దగా గుర్తింపు రాలేదు. తరువాత చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు దీని గణిత ప్రాముఖ్యతను గుర్తించడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

ఎలా వెళ్లాలి?

గ్వాలియర్‌లోని రాజమాత విజయరాజే సింధియా విమానాశ్రయం నుంచి గ్వాలియర్ కోట సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే  గ్వాలియర్ జంక్షన్ ఢిల్లీ, ఆగ్రా, ముంబై, లక్నో తదితర నగరాలతో మంచి రైల్వే అనుసంధానం కలిగి ఉంది. ఢిల్లీ, ఆగ్రా, ఝాన్సీ, ఇండోర్, భోపాల్‌ల నుంచి వెళ్లొచ్చు.