జీతం జీవనానికి ఆధారం.. కానీ జీవితం ఆనందానికి చిరునామా
ఉదయం అలారం మోగుతుంది. ఆఫీసుకు వెళ్లాలి. పని ముగించాలి. ఇంటికి రావాలి. మళ్లీ రేపటి కోసం సిద్ధం కావాలి. ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతుంటాయి. ఒక దశలో మనం ఉద్యోగం చేస్తున్నామా? లేక ఉద్యోగమే మన జీవితాన్ని నడిపిస్తోందా? అనే ప్రశ్న ఎదురవుతుంది. ఉద్యోగం అందరి అవసరం. అది మనకు ఆర్థిక భద్రతను ఇస్తుంది. కుటుంబాన్ని పోషించే శక్తిని ఇస్తుంది. ఉద్యోగమే జీవితం కాదు. జీవితంలో డబ్బుతో కొనలేని ఎన్నో విలువైన విషయాలు ఉన్నాయి.
పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు వారితో గడిపిన ఒక గంట, తల్లిదండ్రులతో కూర్చొని మాట్లాడిన ఒక సాయంత్రం, స్నేహితులతో పంచుకున్న నవ్వులు, జీవిత భాగస్వామితో పంచుకున్న చిన్న చిన్న క్షణాలు.. ఇవన్నీ జీవితానికి నిజమైన సంపద. ఒకసారి కోల్పోతే మళ్లీ తిరిగి రావు. చాలామంది ‘ఇంకొంచెం సంపాదిద్దాం.. తర్వాత ప్రశాంతంగా జీవిద్దాం’ అని అనుకుంటారు. కానీ ఆ ‘తర్వాత’ ఎప్పుడు వస్తుందో తెలియదు. జీతం పెరుగుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. లక్ష్యాలు మారుతాయి. కానీ జీవితం మాత్రం ప్రతిరోజూ కొంచెం కొంచెంగా తగ్గిపోతూనే ఉంటుంది.
మన ఆరోగ్యం కూడా ఉద్యోగం కంటే గొప్పది. శరీరం సహకరించకపోతే సంపాదించిన డబ్బంతా ఆసుపత్రులకే వెళ్లే పరిస్థితి వస్తుంది. కాబట్టి పనితో పాటు ఆరోగ్యానికి సమయం కేటాయించడం కూడా జీవిత బాధ్యతే. మన కలలు కూడా జీతం స్లిప్‌లో ఉండవు. చదవాలనుకున్న పుస్తకం, వెళ్లాలనుకున్న ప్రదేశం, నేర్చుకోవాలనుకున్న కళ, చేయాలనుకున్న సేవా కార్యక్రమం.. ఇవన్నీ మన జీవితాన్ని సంపూర్ణంగా మారుస్తాయి. వాటిని ‘రిటైర్ అయిన తర్వాత చూద్దాం’ అని వాయిదా వేయకూడదు.
మనిషి చివరికి గుర్తు చేసుకునేది ఎంత జీతం వచ్చిందో కాదు. ఎంత ఆనందంగా జీవించారో , ఎంతమందికి తోడుగా నిలిచారో , కుటుంబానికి ఎంత సమయం ఇచ్చారో , తన మనసుకు నచ్చిన పనులు ఎంత చేశారో అన్నదే. ఉద్యోగం మన జీవితంలో ఒక భాగం మాత్రమే. కానీ కుటుంబం, ఆరోగ్యం, స్నేహం, ప్రేమ, సేవ, అభిరుచులు, ప్రకృతి, ప్రశాంతత.. ఇవన్నీ కలిసి జీవితం అవుతాయి.
ప్రతిరోజూ మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ‘నేను ఉద్యోగం కోసం మాత్రమే బ్రతుకుతున్నానా? లేక జీవితాన్ని కూడా నిజంగా జీవిస్తున్నానా?’ అని. ఎందుకంటే చివరికి మన పేరును నిలబెట్టేది మన పదవి కాదు.. మనం ఎలా జీవించామన్న జ్ఞాపకాలు. జీతం ఖాతాలో మిగులుతుంది. కానీ ప్రేమ, అనుభూతులు, మనుషులు మాత్రం హృదయంలో మిగులుతారు.
అందుకే ఉద్యోగాన్ని ప్రేమించండి. కానీ జీవితాన్ని మరచిపోకండి. ఎందుకంటే ఉద్యోగం ఒక రోజు ముగుస్తుంది. జీవితం కూడా ఒక రోజు ముగుస్తుంది. అయితే జీవించిన ప్రతి రోజు అర్థవంతంగా ఉండాలంటే ఉద్యోగంతో పాటు మనసుకు నచ్చిన జీవితం కూడా ఉండాలి.
