చిన్న అజాగ్రత్తతో రూ.6.40 లక్షలు మాయం!

Money

నకిలీ ఈ-చలానా నుంచి ఫేక్ కస్టమర్ కేర్ వరకు.. విజయవాడలో సైబర్ మోసాల కలకలం

విజయవాడ: టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, సైబర్ నేరగాళ్ల మోసాల పద్ధతులు కూడా అంతే వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, యాప్స్, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌పై అవగాహన ఉన్న యువతే సైతం సైబర్ మాయగాళ్ల వలలో చిక్కుతుండటం ఆందోళన కలిగిస్తోంది. విజయవాడ నగరంలో వెలుగులోకి వచ్చిన రెండు ఘటనల్లో బాధితులు ఏకంగా రూ.6.40 లక్షలు కోల్పోయారు.

ఒక్క APK లింక్.. రూ.5.69 లక్షలు ఖాళీ!

మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ యువకుడి మొబైల్‌కు వాహనంపై ఫైన్ పడిందంటూ నకిలీ ఈ-చలానా సందేశం వచ్చింది. కింద ఉన్న APK లింక్‌ను నొక్కి చలానా చెల్లించాలంటూ వచ్చిన సందేశాన్ని నిజమని నమ్మిన యువకుడు ఆ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేశాడు. దీంతో అతడి మొబైల్‌లోకి హానికరమైన సాఫ్ట్‌వేర్ చేరినట్లు తెలిసింది. అనంతరం బ్యాంకు ఖాతా, క్రెడిట్ కార్డు లావాదేవీల ద్వారా రూ.5.69 లక్షలు సైబర్ నేరగాళ్లు దోచుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

రీఫండ్ పేరుతో రూ.71 వేల టోకరా

మరో ఘటనలో వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వస్తువు రాకపోవడంతో సమస్య పరిష్కారం కోసం ఇచ్చిన కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేసింది. అవతలి వ్యక్తి రీఫండ్ చేస్తామని నమ్మించి బ్యాంకు వివరాలు, ఓటీపీని సేకరించాడు. క్షణాల్లో ఆమె ఖాతా నుంచి రూ.71 వేలు మాయమయ్యాయి.

‘లింక్ నొక్కే ముందు ఒక్కసారి ఆలోచించండి’

ఈ ఘటనల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. గుర్తుతెలియని లింకులు, APK ఫైళ్లు డౌన్‌లోడ్ చేయవద్దని, గూగుల్‌లో కనిపించే అనధికారిక కస్టమర్ కేర్ నంబర్లను నమ్మవద్దని సూచిస్తోంది. బ్యాంకు ఓటీపీ, పిన్, సీవీవీ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పకూడదని హెచ్చరిస్తోంది.సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.