రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ భేటీ
అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో రైల్వే అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.ఈ మేరకు సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం కార్యాలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో సమావేశమై పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో చేపట్టాల్సిన రైల్వే అభివృద్ధి కార్యక్రమాలు మౌలిక సదుపాయాల బలోపేతం,ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పన,రైల్వే కనెక్టివిటీ విస్తరణ, పెండింగ్‌లో ఉన్న కీలక ప్రాజెక్టుల వేగవంతమైన అమలు తదితర అంశాలను ఎంపీ సీఎం రమేష్ గారు జీఎం దృష్టికి తీసుకెళ్లారు.
అనకాపల్లి ప్రాంతం పారిశ్రామికంగా,వాణిజ్యపరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రైల్వే సదుపాయాలు కల్పించాలని కోరారు.ఈ ప్రతిపాదనలపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సానుకూలంగా స్పందించారు
.ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే అభివృద్ధి కార్యక్రమాల అమలుకు అధికారులు సహకరిస్తామని వెల్లడించారు.అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో రైల్వే రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరిన్ని రైల్వే సదుపాయాలు తీసుకురావడానికి నిరంతరం కృషి కొనసాగిస్తామాని ఎంపీ గారు పేర్కొన్నారు.
