విజయవాడ :పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు రద్దు చేయాలని కోరుతూ ఈరోజు మీసాల రాజేశ్వరరావు వంతెన ఎదురుగా ఉన్న సీతన్నపేట డివైడర్లు వద్ద వందలాది ముఠా ఆటోలతో ప్రదర్శనతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి సి.పి.ఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మద్దతు తెలిపి మాట్లాడుతూ యుద్ధం పేరు చెప్పుకొని కేంద్రంలో బి.జె.పి ప్రభుత్వం రోజు రోజుకి పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు పెంచటం వలన ముఠా కార్మికుల పై పెనుబారం పడుతుందని దీని కారణంగా ముఠా కార్మికులకు జీవనోపాధి తగ్గిపోయి వారి కుటుంబాలు గడవడమే కష్టంగా మారిందని పెట్రోల్,డీజిల్ ధరలు పెరగటం వలన ప్రతి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ముఠా కార్మికుల సంపాదన సగభాగం కోల్పోతున్నారని తెలిపారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ పై వేసే పన్నులను ఉపసంహరించుకుంటే ఇప్పుడున్న ధరల కంటే సగం ధరకే పెట్రోల్ డీజిల్ వస్తాయని తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా సిఐటియు ఉపాధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ ఆదాని, అంబానీ లాంటి బడా కార్పొరేటర్ల లాభాల కోసమే ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని పెట్రోల్, డీజిల్,గ్యాస్ ధరలు రోజురోజుకీ పెరగటంతో ప్రజల ఆదాయం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కనుక ఇప్పటికైనా ప్రభుత్వాలు పునరాలోచించి పెట్రోల్,డీజిల్ గ్యాస్ ధరలు రద్దు చేయాలని లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ముఠా వర్కర్స్ యూనియన్ సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు ఎం. సీతారాములు, ఎం.బ్రహ్మయ్య, సెంట్రల్ సిటీ ప్రధాన కార్యదర్శి కె. దుర్గారావు, తూర్పు సిటీ ప్రధాన కార్యదర్శి ఎన్.నాగేశ్వరరావు, ముఠా వర్కర్స్ యూనియన్ నగర నాయకులు సిహెచ్ నరసింహులు,జి.వెంకట్రావు, సిహెచ్ దాసు, నల్లగట్ల శ్రీను, కొండారెడ్డి, ఖాశియ్య,రాజియ్య తదితరులు పాల్గొన్నారు.
