జూన్ 3 తర్వాతే ..
జూన్ వచ్చిందంటే చాలు నైరుతి రుతుపవనాల రాక కోసమే ప్రతీ ఒక్కరూ ఎదురు చూస్తుంటారు. కానీ ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా జూన్ మొదటి వారంలో కేరళను తాకే రుతుపవనాలు, ఈ ఏడాది ఎప్పుడు ప్రవేసి స్తాయనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. మే 26న కేరళలోకి రుతుపవనాలు వస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) గతంలో అంచనా వేసినా అది నిజం కాలేదు. దీంతో కొత్త తేదీని ప్రకటించకుండా, రాబోయే 3-4 రోజుల్లో పరిస్థితులు అనుకూలంగా మారవచ్చని మాత్రమే చెప్తోంది . ప్రస్తుతం గాలులు బలహీనంగా ఉండటంతో జూన్ 3 తర్వాతే రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.
అండమాన్ సముద్రంలోకి రుతుపవనాలు మే 16కే ప్రవేశించినప్పటికీ, ప్రధాన భూభాగానికి చేరడంలో ఆలస్యం జరుగుతోంది. కేరళలో ప్రవేశించిన తర్వాత తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. ఈశాన్య భారతదేశంలో జూన్ 5 నుంచి 10 మధ్య, మహారాష్ట్రతో పాటు తూర్పు భారతదేశంలో జూన్ 10 తర్వాత రుతుపవనాలు చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇక మరో ఆందోళనకర విషయం ఏమిటంటే, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా కురిసే వర్షపాతం అంచనాను IMD 92 శాతం నుంచి 90 శాతానికి తగ్గించింది. అంటే ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించింది.
దేశంలో వార్షిక వర్షపాతంలో దాదాపు 75 శాతం వాటా నైరుతి రుతుపవనాలవే . వరి, పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి ఖరీఫ్ పంటల సాగు ఈ వర్షాలపైనే ఆధారపడి ఉంటాయి . అందువల్ల రుతుపవనాల ఆలస్యం, తక్కువ వర్షపాతం అంచనాలు వంటివి రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
