మనసులో శత్రువుకు చోటిస్తే.. గెలుపు అతడిదే!

Enemy

మనిషి జీవితంలో జరిగే ప్రతి పోరాటం రణరంగంలోనే ఉండదు. కొన్ని యుద్ధాలు కత్తులు, తుపాకులతో కాకుండా మన మనసులోనే నిశ్శబ్దంగా సాగుతుంటాయి. మనల్ని బాధించిన వ్యక్తి మనకు ఎంత దూరంగా ఉన్నా, అతడి జ్ఞాపకాలు మాత్రం నిరంతరం మన ఆలోచనల్లో తిరుగుతుంటే, తెలియకుండానే మన మనసుపై అతడికి ఆధిపత్యం ఇచ్చినట్లే.

ఎవరో మనల్ని మోసం చేసినప్పుడు, అవమానించినప్పుడు లేదా అన్యాయం చేసినప్పుడు కోపం రావడం సహజం. బాధపడటం కూడా సహజమే. కానీ ఆ బాధ రోజులు, నెలలు, సంవత్సరాల పాటు మన జీవితాన్ని నియంత్రించడం మొదలైతే అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ‘వాళ్లు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎప్పుడు ఓడిపోతారు? వారికి ఎలా బుద్ధి చెప్పాలి?’ అనే ఆలోచనలు మనసును ఆక్రమిస్తాయి.

ప్రతీకారం కోసం కాదు.. ప్రశాంతత కోసం

మన లక్ష్యాలపై పెట్టాల్సిన దృష్టి ప్రతీకారంపైకి మళ్లుతుంది. కుటుంబంతో ఆనందంగా గడపాల్సిన సమయం కోపంలో కరిగిపోతుంది. గతంలో జరిగిన ఒక సంఘటనను పదేపదే గుర్తుచేసుకుంటూ వర్తమానాన్ని కూడా చేజార్చుకుంటాం. శత్రువు మన ముందు లేకపోయినా, మన ఆలోచనల గదిలో మాత్రం అతడే ప్రధాన పాత్రగా మారిపోతాడు. నిజానికి శత్రువు గెలుపు ఇక్కడే ప్రారంభమవుతుంది. అతడు మన జీవితాన్ని నేరుగా నియంత్రించకపోయినా, మన ఆలోచనలను మాత్రం ప్రభావితం చేస్తున్నాడు. మన సమయం, మన శక్తి, మన ప్రశాంతత అన్నీ అతడి చుట్టూనే తిరుగుతున్నప్పుడు నష్టపోయేది చివరికి మనమే.

క్షమించడం బలహీనత కాదు

ఈ స్థితి నుంచి బయటపడటం అంటే జరిగిన అన్యాయాన్ని సమర్థించడం కాదు. క్షమించడం అంటే తప్పు చేసిన వ్యక్తిని గొప్పవాడిగా చూడటం కూడా కాదు. ‘నీ తప్పు కారణంగా నా భవిష్యత్తును ఇకపై నాశనం చేసుకోను’ అని మనకు మనమే చెప్పుకునే ధైర్యమే నిజమైన క్షమ. నిజమైన ప్రతీకారం ఎదుటివారిని కూల్చడం కాదు. మనల్ని కూల్చాలని చూసిన పరిస్థితులను దాటి మరింత బలంగా ఎదగడం. ఆరోగ్యం, కుటుంబం, లక్ష్యాలు, కలలు.. వీటిపై మన దృష్టిని మళ్లించిన రోజే మన జీవితంపై నియంత్రణ తిరిగి మన చేతికి వస్తుంది.

అంతిమంగా గెలుపు అంటే శత్రువును ఓడించడం కాదు మన మనసును అతడి ప్రభావం నుంచి విముక్తి చేయడం. మన ఆలోచనలకు తాళం మన చేతిలో ఉన్న రోజే అసలైన విజయం మన సొంతమవుతుంది.