ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రపంచంలో తొలి క్వాడ్రిలియనీర్ (1,000 ట్రిలియన్ డాలర్ల సంపద కలిగిన వ్యక్తి)గా మారే అవకాశం ఉందా ? అనే దానిపై స్పందిస్తూ, ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మానవ నాగరికత భూమిని దాటి చంద్రుడు, అంగారక గ్రహాల వరకు విస్తరించినట్లయితే అది ‘అసాధ్యం కాదని’ ఆయన అన్నారు.
ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టులో, స్సెస్ ఎక్స్ లో భారీ స్థాయిలో పబ్లిక్ లిస్టింగ్ సాధించిన తర్వాత మస్క్ సంపద సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరిందని, క్వాడ్రిలియనీర్ కావాలంటే ఇంకా 998.9 ట్రిలియన్ డాలర్లు అవసరమని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మస్క్ ‘నాట్ ఇంపాసిబుల్’(అసాధ్యం కాదు) అంటూ వ్యాఖ్యానించారు.
చంద్రుడు, అంగారక గ్రహాలపై పరిశ్రమలే లక్ష్యం
అంతటి సంపద ఎలా సాధ్యమవుతుందని అడిగినప్పుడు ‘చంద్రుడు, అంగారక గ్రహాలపై ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఇది మస్క్ ఎన్నో ఏళ్లుగా చెబుతున్న లక్ష్యానికే కొనసాగింపుగా కనిపిస్తోంది. స్సెస్ ఎక్స్ ద్వారా అభివృద్ధి చేస్తున్న స్టార్ షిప్ రాకెట్ వ్యవస్థ మనుషులను, సరుకులను చంద్రుడు, అంగారక గ్రహాలకు తరలించేలా రూపొందించబడుతోంది.
బహుగ్రహ జీవులుగా మారాల్సిందే
మస్క్ అభిప్రాయం ప్రకారం.. మానవజాతి దీర్ఘకాలిక మనుగడకు ఒకే గ్రహంపై ఆధారపడకుండా బహుగ్రహ (మల్టీ-ప్లానెటరీ) నాగరికతగా మారాలి. భూమి వెలుపల శాశ్వత నివాసాలు ఏర్పడితే, అక్కడ భారీ స్థాయిలో పరిశ్రమలు, తయారీ రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆయన విశ్వసిస్తున్నారు.
ఆయన దృష్టిలో భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలు భూమికే పరిమితం కాకుండా అంతరిక్షంలోకి విస్తరించవచ్చు. అప్పుడు ప్రస్తుతం ఊహించలేని స్థాయిలో సంపద సృష్టి జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
డాలర్లు ఉండకపోవచ్చు!
క్వాడ్రిలియన్ డాలర్ల సంపద గురించి మాట్లాడుతున్నప్పుడు మస్క్ మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘అప్పటికి డాలర్లు కరెన్సీగా ఉండకపోవచ్చు. బదులుగా ద్రవ్యరాశి (మాస్), శక్తి (ఎనర్జీ) ఆధారంగానే విలువను కొలవవచ్చు’ అని అన్నారు.అంటే భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారిపోయి, సంపదను కొలిచే విధానాలు కూడా భిన్నంగా ఉండవచ్చని ఆయన సూచించారు.
వాస్తవమా? ఊహాగానమా?
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం పరిమాణంతో పోలిస్తే క్వాడ్రిలియన్ డాలర్ల సంపద అనేది ఊహకు అందని స్థాయిలో ఉంది. ఒక క్వాడ్రిలియన్ అంటే వెయ్యి ట్రిలియన్ డాలర్లు. ఇది నేటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలువ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ.
అయితే మస్క్ కామెంట్స్ ఆయన భవిష్యత్తు దృష్టిని స్పష్టంగా చూపిస్తున్నాయి. భూమిని దాటి అంతరిక్షంలో పరిశ్రమలు, నివాసాలు ఏర్పడే ప్రపంచాన్ని ఆయన ఊహిస్తున్నారు. ఆ ప్రపంచంలో సంపద, ఆర్థిక వ్యవస్థ, కరెన్సీల భావనలే పూర్తిగా మారిపోవచ్చని ఆయన నమ్ముతున్నారు.
