-ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ.. ప్రజాస్వామ్యంపై నిరంకుశ దాడి
-‘ఉపా’ చట్టం దుర్వినియోగం
-బిజెపి అజెండా మోస్తే.. బిజెపితోనే టీడీపీ రాజకీయ ఉనికికి ప్రమాదం
-ఆగస్టు 6 నుంచి 15 వరకు ‘మార్పు కోసం’ సిపిఐ పాదయాత్రలు
– విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. విజయవాడ దాసరి భవన్‌లో మంగళవారం ఈశ్వరయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో చర్చించి ఒక తీర్మానం చేసినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో సమస్యలు ఒక వైపున తీవ్రతరమవుతున్నాయని, వర్షాభావ పరిస్థితుల్లో రైతాంగం కరువు కాటకాల్లో కూరుకుపోతున్నారన్నారు. సీఎం చంద్రబాబు మామిడి, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ కేంద్రానికి లేఖలు రాసినప్పటికీ, ఎక్కడా స్పందన లేకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వానికి పాలనపై పట్టులేదనేదీ స్పష్టమవుతోందన్నారు. ఒక వైపు ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, రక్షణ కోసం వచ్చిన వారిని రక్షక భటులే భక్షకులుగా మారి లాకప్‌డెత్‌లు చేయడం, వేధింపుల పర్వం సంఘటనలు కొనసాగడం విచారకరమన్నారు. అందుకు నిదర్శనంగా విజయవాడలో గాదె సాయికృష్ణ, పేరుపోగు క్రాంతికుమార్, కర్నూలు జిల్లా గంగమ్మ సంఘటనలే నిదర్శనమని తెలిపారు. ఇదే క్రమంలో దళిత క్రైస్తవ సభకు వెళ్లి మాట్లాడిన ప్రశ్న రావణ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే నెపంతో నాలుగు పోలీస్‌స్టేషన్లలో కేసులు, ఆ తర్వాత బెయిల్ రావడంతో ఉపా చట్టం నమోదు చేశారు. ఉపా చట్టానికి వ్యతిరేకంగా విజయవాడలో ఇటీవల సీపీఐ నిర్వహించిన రౌండ్‌టేబుల్‌పై కొందరు అనాలోచిత వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టారు. అధికారంలో వున్న ప్రభుత్వమైనా సరే.. తమను ప్రశ్నిస్తే ఉపా చట్టం నమోదు చేస్తామంటూ లైసెన్సులు మంజూరు చేయవచ్చా? అని సూటిగా ప్రశ్నించారు. తాము ఏ మతానికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఉపా చట్టాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ రాష్ట్రవ్యాప్తంగా విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, అనంతపురం నగరాల్లో మేధావులు, న్యాయవాదులు, రచయితలు, జర్నలిస్టులు, ప్రజాస్వామ్యవాదులు, వివిధ రాజకీయ పక్షాలతో కలిసి విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
సీఎం చంద్రబాబు.. బీజేపీ రాజకీయ ఎజెండాను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ చెప్పిందే అమలు చేస్తూ పోతే భవిష్యత్తులో టీడీపీ రాజకీయ ఉనికిని బిజెపి దెబ్బతీయడం ఖాయమన్నారు. ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడిన వారిపైనే చర్యలు తీసుకునే ముందు.. ఒక్కసారి కూటమిలోని జనసేన, టీడీపీ, బీజేపీకి చెందిన సోషల్ మీడియా ఖాతాలపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ద్వందవైఖరికి నిదర్శనమన్నారు. పోలీస్ స్టేషన్లపై దాడులు చేయమని ప్రోత్సహించడం ఏ చట్టంలో వుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సీపీఐ జాతీయ పిలుపు మేరకు ఆగస్టు 6 నుంచి 15 వరకు ‘మార్పు కోసం’ అనే నినాదంతో దేశవ్యాప్త సీపీఐ పిలుపులో భాగంగా రాష్ట్రంలో ప్రచార యాత్రలు, పాదయాత్రలు నిర్వహిస్తామని తెలిపారు. ఆగస్టు 17 నుంచి 27 వరకు పార్టీ అనుబంధ ప్రజాసంఘాలు తమ తమ సమస్యలపై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాయని తెలిపారు. సెప్టెంబర్ 1న దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగే మహాసభకు రాష్ట్రం నుంచి సుమారు మూడు వేల మందిని సమీకరిస్తామని వెల్లడించారు. సెప్టెంబర్ చివరి వారంలో కడపలో నాలుగు రోజులపాటు సీపీఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. దేశంలోను, రాష్ట్రంలోను అప్రకటిత ఎమర్జెన్సీ వాతావరణం నెలకొంటోందని ఆయన హెచ్చరించారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో.. 2023లో ఆమోదించిన 106వ రాజ్యాంగ సవరణలో సెన్సస్, నియోజకవర్గాల పునర్విభజనతో అనుసంధానం చేసిన విధానాన్ని విరమించి, ఎలాంటి షరతులు లేకుండా వెంటనే 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథ్‌రెడ్డి, దోనేపూడి శంకర్ పాల్గొన్నారు.
