విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఆదివారం భక్తజన కోలాహలం నెలకొంది. సెలవు దినం కావడంతో నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి భక్తుల సందడి అధికంగా ఉండడంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 నుంచి అంతరాలయ దర్శనాలను నిలిపివేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అన్ని రకాల విఐపి దర్శనాలను రద్దు చేశారు. దీంతో భక్తులకు అమ్మవారి దర్శనం త్వరితగతిన పూర్తయింది.
మొబైల్ వాటర్ క్యాన్లతో నీటి సరఫరా
దుర్గగుడి ఈఓ శీనానాయక్ భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా భక్తుల వద్దకే మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా చల్లని తాగునీటిని అందజేశారు. దీనికి భక్తుల నుంచి హర్షం వ్యక్తం అయింది. ఆలయ పరిసరాల్లో భక్తులకు ఉచిత ప్రసాదం, అన్న ప్రసాదం పంపిణీ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ బి.రాధాకృష్ణ, ఇతర కమిటీ సభ్యులు క్యూ లైన్లను పర్యవేక్షించి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూశారు. ఆలయ ఇతర అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఇంద్రకీలాద్రిపై భక్తజన కోలాహలం
