రానున్న ఆషాడ మాస సారె సమర్పించు భక్త బృందాలకు ప్రత్యేక ఏర్పాట్లు
దుర్గా ఘాట్, కేశఖండనశాల వసతులు
పరిశీలన
వేసవి సందర్బంగా భక్తులకు దేవస్థానం నుంచి కల్పిస్తున్న సౌకర్యాలు, రానున్న ఆషాఢమాసంలో దేశవ్యాప్తంగా భక్త బృందాలు సారె సమర్పణకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు గురించి మంగళవారం ఉదయం దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ), కార్యనిర్వహణాధికారి వికె శీనానాయక్ దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులతో కలసి క్షేత్రస్థాయి పర్యటన జరిపారు. ఇంద్రకీలాద్రి ముఖద్వారమైన దుర్గా స్నానఘాట్ అభివృద్ధి, కేశ ఖండన శాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన షెడ్, భక్తులు సేద దీరే ఏర్పాటును పరిశీలన చేసారు. తలనీలాలు సమర్పించే భక్తులు ఆన్ లైన్ టికెట్ కొనుగోలు మెషిన్ పరిశీలించి, సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. కనకదుర్గ నగర్ లో ప్రసాదాల కౌంటర్స్ ప్రక్కన భక్తులకు ఎండ వేడిమి నుంచి రక్షించే షెడ్ ఏర్పాట్లు, సురక్షిత మంచి నీటి ప్లాంట్ ప్రాంతంలో మెరుగైన సౌకర్యం, ఘాట్ రోడ్ లో ఆన్ లైన్ సేవా కేంద్రం, దర్శనం క్యూ లైన్లు మార్పులు, లగేజ్, చెప్పులు స్టాండ్స్ ప్రదేశాలను పరిశీలన చేశారు.
వాహనాల పార్కింగ్ విషయంలో..
వాహనాల పార్కింగ్ విషయంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దిశగా ఆలోచించి, భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యవంతమైన సేవలు అందించాలని ఇంజినీరింగ్ అధికారులను చైర్మన్, ఈవో ఆదేశించారు. క్యూ లైన్ ద్వారా ప్రధాన ఆలయం వరకు ఈ బృందం ప్రయాణించి, భక్తులకు తా గునీరు, ఫ్యాన్ సౌకర్యాలు పరిశీలన చేశారు.
మరుగుదొడ్లు పరిశీలించి శుభ్రత విషయంలో మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. శివాలయం వైపు ర్యాంప్ మీదుగా ప్రయాణించి ఇంజినీరింగ్ అధికారులకు తగు సూచనలు చేసారు. కొత్త అన్నదానం భవనం, కొత్త లడ్డు పోటు నిర్మాణాలు పరిశీలించి, త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ కోటేశ్వరరావు, రమాదేవి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్. రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
