డైనోసార్లు సంచరించిన ఖండం
చిన్నప్పటి నుంచి మనకు తెలిసినవి ఏడు ఖండాలె. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా … ఇవే ప్రపంచంలోని ఏడు ఖండాలని అందరికీ తెలుసు. అయితే కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు ఈ జాబితాలో మరో ఖండాన్ని చేర్చాల్సిన అవసరం ఉందని వాదిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ ఖండం భూమిపై కాకుండా సముద్రం అడుగున దాగి ఉంది. దాని పేరు జిలాండియా . 2017లో 11 మంది భూగర్భ శాస్త్రవేత్తలు కలిసి ఒక కీలక పరిశోధన ప్రచురించారు. వారి అభిప్రాయం ప్రకారం జీలాండియా కేవలం మునిగిపోయిన ద్వీపాల సమూహం కాదు, ఒక స్వతంత్ర ఖండం. ప్రస్తుతం ప్రపంచం గుర్తించిన ఏడు ఖండాల సరసన దీనిని ‘ఎనిమిదో ఖండం’గా గుర్తించాల్సిన సమయం వచ్చిందని వారు పేర్కొన్నారు.
సముద్రం అడుగున దాగిన మహా ఖండం
జీలాండియా నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. దీని విస్తీర్ణం సుమారు 49 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇది భారతదేశం కంటే పెద్దది, ఆస్ట్రేలియా పరిమాణంలో దాదాపు మూడింట రెండు వంతులు ఉంటుంది. అయితే దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ ఖండంలో 94 శాతం భాగం సముద్ర జలాల కింద మునిగిపోయి ఉంది. కేవలం న్యూ జిలాండ్ , న్యూ కాలెడోనియా వంటి కొన్ని ప్రాంతాలు మాత్రమే నీటి పైభాగంలో కనిపిస్తున్నాయి. అందుకే చాలా కాలం పాటు శాస్త్రవేత్తలు దీనిని విడివిడిగా ఉన్న భూభాగాల సమాహారంగా భావించారు. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆ అభిప్రాయాన్ని మార్చేసింది.
జీలాండియాను ఖండంగా ఎందుకు గుర్తిస్తున్నారు?
ఒక ప్రాంతాన్ని ఖండంగా గుర్తించడానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రాంతానికి ప్రత్యేక భూగర్భ నిర్మాణం, మందమైన ఖండీయ భూపటలం, స్పష్టమైన భౌగోళిక సరిహద్దులు, ఇతర సముద్ర ప్రాంతాల కంటే భిన్నమైన శిలల నిర్మాణం ఉండాలి. ఉపగ్రహ సర్వేలు, సముద్ర అడుగు మ్యాపింగ్, లోతైన డ్రిల్లింగ్ పరిశోధనల ద్వారా జీలాండియా అన్ని ప్రమాణాలను పూర్తి చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సముద్ర అడుగున ఉండే సాధారణ భూపటలం సుమారు 7 కిలోమీటర్ల మందం మాత్రమే ఉంటుంది. కానీ జీలాండియా భూపటలం సగటున 20 కిలోమీటర్ల మందంగా ఉంది. ఇది ఖండాలకు ఉండే లక్షణం. అంతేకాకుండా ఇందులో సిలికా అధికంగా ఉన్న ఖండీయ శిలలు కనిపించాయి. పర్వతాలు, లోయలు, పీఠభూములు, బేసిన్లు వంటి భౌగోళిక నిర్మాణాలు కూడా ఒకే ఖండంగా ఉన్నట్లు సూచిస్తున్నాయి.
ఒకప్పుడు భూమిపై ఉన్న ఖండమే
శాస్త్రవేత్తల అంచనా ప్రకారం జీలాండియా ఒకప్పుడు గోండ్వానా అనే మహాఖండంలో భాగంగా ఉండేది. గోండ్వానాలో ప్రస్తుతం ఉన్న ఆఫ్రికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, భారత ఉపఖండం అన్నీ కలిసి ఉండేవి. సుమారు 10 కోట్ల సంవత్సరాల క్రితం గోండ్వానా విడిపోవడం ప్రారంభమైంది. ఆ సమయంలో జీలాండియా కూడా ఆస్ట్రేలియా నుంచి వేరుపడింది. ఈ ప్రక్రియలో భూమి పొర విపరీతంగా సాగిపోవడంతో అది పలుచబడింది. ఫలితంగా జీలాండియా క్రమంగా సముద్రంలోకి దిగజారిపోయింది. కొంతమంది పరిశోధకుల ప్రకారం సుమారు 8.5 కోట్ల సంవత్సరాల క్రితం ఈ మునిగిపోయే ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపు 2.5 కోట్ల సంవత్సరాల క్రితం నాటికి దాని ఎక్కువ భాగం సముద్రం కిందకు వెళ్లిపోయింది.
డైనోసార్లు సంచరించిన ఖండం
జీలాండియా ఒకప్పుడు పూర్తిగా భూమిపై ఉండేదనే విషయానికి శిలాజాలు బలమైన ఆధారాలు అందిస్తున్నాయి. న్యూజిలాండ్, చాతం ద్వీపాల్లో డైనోసార్ ఎముకలు లభించాయి. సారోపాడ్లు, ఆంకైలోసార్లు, మాంసాహార డైనోసార్లకు చెందిన అవశేషాలు ఇక్కడ కనుగొన్నారు. ఈ శిలాజాలు జీలాండియా గోండ్వానా నుంచి విడిపోయిన తర్వాత కూడా చాలా కాలం వరకు నీటి పైభాగంలో ఉన్నట్లు సూచిస్తున్నాయి. అంటే డైనోసార్లు ఈ ఖండంపై సంచరించాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.\
సముద్రం అడుగున లభించిన కీలక ఆధారాలు
2017లో శాస్త్రవేత్తలు జోయిడ్స్ రెసొల్యూషన్ అనే పరిశోధన నౌక ద్వారా జీలాండియా ప్రాంతంలో ఆరు ప్రాంతాల్లో లోతైన డ్రిల్లింగ్ నిర్వహించారు. సముద్రం అడుగున నుంచి తీసిన నమూనాల్లో పుప్పొడి, మొక్కల అవశేషాలు, సూక్ష్మ జీవుల శిలాజాలు లభించాయి. ఇవి ఒకప్పుడు అక్కడ భూమి ఉండేదనే విషయాన్ని బలపరిచాయి. ప్రస్తుతం సముద్రం కింద ఉన్న ప్రాంతాలు గతంలో భూభాగాలుగా ఉన్నాయని ఈ పరిశోధనలు నిర్ధారించాయి.
జీలాండియా గుర్తింపు ఎందుకు ముఖ్యమైనది?
జీలాండియాను అధికారికంగా ఖండంగా గుర్తిస్తే అది భూగర్భ శాస్త్రానికే కాదు, ఆర్థిక రంగానికీ కీలకమవుతుంది. సముద్ర చట్టాల ప్రకారం ఒక దేశం తన ఖండీయ భూపటలం ఎంతవరకు విస్తరించి ఉందో నిరూపించగలిగితే అదనపు సముద్ర ప్రాంతాలపై హక్కులు పొందవచ్చు.దీంతో న్యూజిలాండ్‌కు సముద్ర గర్భంలోని ఖనిజాలు, చమురు, సహజవాయువు వంటి వనరులపై మరింత హక్కు లభించే అవకాశం ఉంది.
ఇంకా అధికారిక గుర్తింపు ఎందుకు రాలేదు?
శాస్త్రవేత్తలలో చాలామంది జీలాండియాను ఖండంగా అంగీకరిస్తున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా అన్ని భౌగోళిక సంస్థలు అధికారికంగా దీనిని ఎనిమిదో ఖండంగా ప్రకటించలేదు. అయినప్పటికీ దీనిపై పరిశోధనలు వేగంగా కొనసాగుతున్నాయి. కొత్త ఆధారాలు వెలుగులోకి వస్తున్న కొద్దీ జీలాండియా స్థానం మరింత బలపడుతోంది.
