-వృక్ష విలాపం
-ఉగ్రరూపంలో ఉష్ణోగ్రతలు
-కనుమరుగవుతున్న పచ్చదనం
-కాంక్రీట్ జంగిల్ లా మారుతున్న ఊరు వాడ
అభివృద్ధి కావాలి గాని ప్రకృతిని చంపి కాదు. ఫ్లైఓవర్లు. షాపింగ్ మాల్స్ మనకు చక్కని వసతి సౌకర్యం అవ్వచ్చు కానీ స్వచ్ఛమైన గాలి స్థలము నీడను ఇచ్చేది పచ్చని చెట్లే. మానవుడు అభివృద్ధి పేరుతో పచ్చదనాన్ని కనుమరుగు చేస్తూ కాంక్రీట్ జంగిల్లా సమాజాన్ని మారుస్తున్నాడు. రేపటి తరానికి మనం కాంక్రీట్ ఎడారిని కాకుండా పచ్చని రాష్ట్రాన్ని అందించాలి. ఓ మనిషి నువ్వు మేలుకోకపోతే భవిష్యత్తులో ఆక్సిజన్ సిలిండర్ ని మో సుకుని తిరగాల్సిన రోజు వస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో కంకిపాడు ఇతర ప్రాంతాల్లో 48 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. పేరు ఏదైనా కానీ పచ్చదనాన్ని అడ్డదిడ్డంగా నరికేస్తుండటం.. మారిపోయాడమ్మ మనిషన్నవాడు అంటూ.. ఈ దారుణ దృశ్యాన్ని చూస్తున్న ఓ మహా వృక్షం ఆవేదన ఇది.
“నేను ఒక చెట్టును… నిన్ను కన్న తల్లిలా వందేళ్లుగా నీకు నీడనిచ్చిన చెట్టును. నిన్ను ఎండ నుంచి కాపాడాను.
నీ ఊపిరికి ప్రాణవాయువునిచ్చాను. నీ పిల్లలకు ఊయలనై ఊపాను. అలసిన బాటసారికి అరుగునై అమ్మలా అక్కున చేర్చుకున్నాను. నా కొమ్మలపై పక్షులకు గూడు కట్టి, వాటి కిలకిలలతో నీ ఉదయాన్ని శుభోదయం చేశాను.
మరి నువ్వు నాకేం చేశావు?
“అభివృద్ధి” అనే పేరుతో నా కాళ్లపై గొడ్డలి వేటు వేశావు.
“రోడ్డు వెడల్పు” అనే సాకుతో నా గుండెను చీల్చావు.
“ఫ్లైఓవర్” అనే నెపంతో నా ఊపిరిని ఆపేశావు. నా వేళ్లతో భూమిని గట్టిగా పట్టుకుని వరదల నుంచి నిన్ను కాపాడితే, నువ్వు నా వేళ్లనే నరికేశావు. నా ఆకులతో నీ నగరానికి చల్లదనం ఇస్తే, నువ్వు నా చిటారు కొమ్మ వరకు నరికేశావు.
ఇప్పుడు నేను కూలిపోతున్నాను..
నాతో పాటు నా మీద గూడు కట్టుకున్న పిచ్చుకల కుటుంబం నేల రాలుతోంది.
నా నీడలో సేద తీరే ముసలాయన కన్నీళ్లు నా మొదలును తడుపుతున్నాయి.
నన్ను నరికిన గొడ్డలి శబ్దానికి, రేపు నీ పిల్లల దగ్గు శబ్దం జత కలవబోతోందని నీకు తెలియదా?
ఒక్కసారి ఆలోచించు
నీ ఏసీ గది చల్లదనం ఇవ్వగలదేమో కానీ, స్వచ్ఛమైన గాలిని ఇవ్వగలదా?
నీ కాంక్రీట్ మేడ వేడి నుంచి తప్పించగలదేమో కానీ, వాన చినుకులతో నిన్ను తడపగలదా?
నీ ఫ్లైఓవర్ ప్రయాణం సులువు చేయొచ్చు, కానీ నా లేని లోటును పూడ్చగలదా?
నేను పోతున్నాను… కానీ వెళ్తూ వెళ్తూ ఒక్క మాట చెబుతున్నాను:
నన్ను నరికిన ప్రతి గొడ్డలి వేటు, రేపు నీ ఊపిరి మీద పడే వేటు అని మరువకు.
ఇంకా సమయం మించిపోలేదు.
నా స్థానంలో పది మొక్కలు నాటు. వాటిని నీ బిడ్డలా పెంచు.అప్పుడైనా నా ఆత్మ శాంతిస్తుంది.”
ఇది ఒక్క చెట్టు ఏడుపు కాదు…
కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న విజయవాడలో నేలకొరుగుతున్న ప్రతి వృక్ష విలాపం.
