పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి అనిత పర్యటన
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సోమవారం పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా సత్యవరం గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు స్వాగతం పలికారు. గ్రామంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు..అనంతరం హోం మంత్రి ఇంటింటికీ వెళ్లి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సత్యవరంలోని గౌరీ పరమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరాంపురం గ్రామంలో బొడ్డపాటి వీరాస్వామి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి.. ఇటీవల అకాల వర్షాల కారణంగా మృతి చెందిన అరట్లకోట గ్రామానికి చెందిన ఎరకయ్య, శంకర్ కుటుంబాలను కూడా పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి నెలా ఒక గ్రామానికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడంతో పాటు ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటున్నామని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి గ్రామ స్థాయి నాయకుల వరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని యజ్ఞంలా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి నెల ఒకటో తేదీ సెలవు రోజు వచ్చినా, ముందుగానే 31వ తేదీన పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు. దేశంలోనే అత్యధిక పెన్షన్ అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మంత్రి పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు.
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు దిశగా కూడా ప్రభుత్వం కీలక అడుగులు వేసిందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం 50 ఎకరాల భూమి కేటాయించకపోవడంతో రైల్వే జోన్ ఏర్పాటుకు ఐదేళ్లు ఆలస్యమైందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించడంతో రైల్వే జోన్ సాధ్యమైందని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి రైల్వే జోన్ ఒక వరమని పేర్కొన్న మంత్రి, ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని మంత్రి అనిత తెలిపారు.
